calender_icon.png 7 March, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాక్

07-03-2025 01:28:58 AM

లగచర్ల, హకీంపేట భూసేకరణ నోటిఫికేషన్లపై

మధ్యంతర ఉత్తర్వులు జారీ

*ప్రభుత్వానికి నోటీసులు

*ఏప్రిల్ 7కు విచారణ వాయిదా

హైదరాబాద్, మార్చి 6 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లాలో మల్టీ పర్ప స్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం జారీచేసిన రెండు భూసేకరణ నోటిఫికేషన్ల అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీచేసింది.

విచారణను ఏప్రిల్ 7కి వాయిదా వేస్తూ జస్టిస్ జే శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీచేశారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో 110.32 ఎకరాలు, హకీంపేటలో 351.10 ఎకరాల చొప్పున భూసేక రణకు 2024 నవంబర్‌లో ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీచేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లను గురువారం హైకోర్టు విచారించింది.

తదుపరి విచారణ వరకు భూసేకరణ నోటిఫికేషన్ల అమలును నిలిపివేయాలని, ఈ వ్యవహారంలో ముందుకు వెళ్లరాదని అధికారు లను ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, వికారాబాద్ జిల్లా కలెక్టర్, లగచర్ల ఆర్డీవో, దుద్యాల తహసిల్దార్, టీఎస్‌ఐఐసీలకు నోటీసులు ఇచ్చింది.

మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు కోసం హకీంపేటలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను కుమ్మరి శివకుమార్, లగచర్లలో భూసేకరణ నోటిఫికేషన్‌ను పీ గోపాల్ నాయక్ మరో 15 మంది రైతులు హైకోర్టులో సవాలు చేశారు. వారి తరఫున సీనియర్ అడ్వొకేట్లు బీఎస్ ప్రసాద్, వీ రఘునాథ్ వాదిస్తూ, పారిశ్రామికవాడ నిమిత్తం ప్రభుత్వం 1,177 ఎకరాలకు పైగా భూసేకరణ చేపట్టాలని రాష్ట్రం నిర్ణయించిందని చెప్పారు.

ఇందుకు ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు 1,177 ఎకరాల్లో 534 ఎకరాలు ప్రభుత్వానికి చెందినవని మిగతా లగచర్లలో 110 ఎకరాలు, హకీంపేటలో 351 ఎకరాలు సేకరించడానికి నోటిఫికేషన్లు జారీచేసిందన్నారు. ఇండస్ట్రియల్ పార్కుకు ఎంత భూమి అవస రం, ఎందుకు ఆ పార్కు ఏర్పాటు చేస్తున్నారు, దాని లక్ష్యం ఏమిటీ, అందులో ప్రజావసరం ఏముంది.. వంటి వివరాలు లేకుండానే నోటిఫికేషన్ ఇవ్వడం చెల్లదన్నారు.

ఇలా నోటిఫికేషన్ ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకమని, చట్ట విరుద్ధమని చెప్పారు. సామాజిక ప్రభావ అధ్యయనం, ప్రజాభిప్రాయ సేకరణ, మార్కెట్ విలువ మొదలైనవి నిర్ణయించకుండా భూసేకరణ ప్రక్రియ చేపట్టడం చెల్లదన్నారు. రైతులకు జీవనాధారం ఈ భూములేనన్నారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా భూసేకరణ ప్రక్రియ ఉందన్నారు.

వెంటనే ఆ ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, రైతులకు తగిన పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. ఒక్కో ఎకరానికి రూ. 20 లక్షల పరిహారంతోపాటు 150 గజా ల ఇంటి జాగా, ఇందిరమ్మ పథకం కిం ద ఇంటి నిర్మాణ సాయం, అర్హులకు ఉద్యోగ కల్పన వంటి చర్యలు తీసుకున్న ట్లు చెప్పారు.

ఇందుకు ఎక్కువ మంది రైతులు ఆమోదం చెప్పారన్నారు. వాదనల తర్వాత న్యాయమూర్తి ప్రతివాదుల కు నోటీసులు జారీ చేశారు. విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేశారు. అప్పటి వరకు నోటిఫికేషన్ నిలిపివేత ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.