25-02-2025 02:14:09 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుపై దర్యాప్తు జరపాలంటూ సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదులో కింది కోర్టు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ అధినేత, మా జీ సీఎం కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్ట్ తీర్పును వాయిదా వేసింది.
బరాజ్ కుంగుబాటుకు కారణం అవినీతి, అక్రమాలేనని, అందుకు బాధ్యులైన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లపై దర్యాప్తు జరపాలని, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాజలింగమూర్తి ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. పిటిషన్ తమ పరిధిలేదంటూ మేజిస్ట్రేట్ కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో రాజలింగమూర్తి జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ దా ఖలు చేశారు.
దీనిపై విచారణార్హతను నిర్ణయించేందుకు భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి గతంలో కేసీఆర్, హరీశ్‌రావు తదితరులకు నోటీసులు సైతం జారీ చేశారు. జడ్జి తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను సోమవారం జస్టిస్ కె.లక్ష్మణ్ మరోసారి విచారణ చేపట్టారు. పీపీ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. ఫిర్యాదుదారు రాజలింగమూర్తి మృతిచెందిన ప్పటికీ ఫిర్యాదుపై విచారణ కొనసాగించవచ్చన్నారు. ఫిర్యాదులో ఎనిమిది మంది సాక్షులున్నారని, వారిని విచారించే పరిధి మేజిస్ట్రేట్‌కు ఉందని వాదించారు.
రాజలింగమూర్తి కుమార్తె పిటిషన్‌లో ఇంప్లీడ్ అవ్వాలనుకుంటున్నారని, పత్రికల్లో కథనాలు వచ్చాయని చెప్తుండగా.. న్యాయమూర్తి కలుగ జేసుకుని..‘పత్రికల్లో కథనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేం’ అని స్పష్టం చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది టీవీ రమణరావు తన వాదనలు వినిపిస్తూ.. ఫిర్యాదు దారు భౌతికంగా లేనప్పుడు.. ఆ ఫిర్యాదు విచారణార్హం కాదని వాదించారు. వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.