calender_icon.png 12 January, 2025 | 7:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక అక్రమ తవ్వకాలపై హైకోర్టు నజర్!

05-08-2024 01:12:59 AM

కామారెడ్డి ఇసుక క్వారీలపై సుమోటో కేసు

ప్రజోపయోగ వ్యాజ్యంగా బార్ అసోసియేషన్ ఫిర్యాదు 

సీజేతో కూడిన ధర్మాసనం నేడు విచారణ!

ప్రతివాదులుగా భూగర్భ, గనులు, రెవెన్యూ, హోం, రవాణాశాఖ, రాష్ట్ర, జిల్లా, మండల అధికారుల పేర్లు

కామారెడ్డి, ఆగస్టు 4 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అధికారుల కళ్లెదుటే ఈ దందా సాగుతున్నా నిమ్మ కు నీరెత్తినట్టు వ్యవహరించడంపై కామారెడ్డి జిల్లా బిచ్కుంద బార్ అసోసియేషన్ రాష్ట్ర హైకోర్టుకు ఫిర్యాదు చేసింది.

ఆ ఫిర్యాదును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో క్వారీలు నడిపిన వ్యక్తులు, వారికి అండగా నిలిచిన ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మింగుడుపడలేదు. కాంగ్రెస్ నాయకుల అనుచరులు క్వారీలను దక్కించుకొని దందాను కొనసాగించారు.

మూడు నెలలుగా బిచ్కుంద, హస్గుల్, మంజీర పరివాహక ప్రాంతంలో వందల లారీలతో నిత్యం ఇసుకను అక్రమ మార్గంలో తరలించారు. అధికార పార్టీ కావడంతో అధికారులు అడ్డుకోలేదు. స్థానిక తహసీల్దార్లు, పోలీసులు, మైనింగ్ అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి అక్రమ  దందాను యథేచ్ఛగా నడిపించారు.

దీంతో రోజు రూ.30 లక్షల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. ఈ దందాపై నివేదిక ఇవ్వాలని జిల్లా మైనింగ్, రెవెన్యూ అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా రోజుకు 18 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించారని నివేదిక పంపించారు. గత నెల 24న జిల్లాలో ప్రభుత్వం నుంచి పర్మిషన్ పొందిన ౪ సంస్థలతోపాటు ఐదుగురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. భూ యాజమానులను బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన సంగతి తెలిసిందే.  

బార్ అసోసియేషన్ ఫిర్యాదు

రోజుకు 30 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలిస్తే.. అధికారులు మాత్రం అక్రమార్కులతో కుమ్మక్కై కేవలం 18 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించారని నివేదిక ఇవ్వడంతో సర్కారు ఆదాయానికి నిత్యం రూ.30 లక్షలు గండిపడింది. దీనిపై బిచ్కుంద బార్ అసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై హైకోర్టు సుమోటోగా కేసు నమోదుచేసింది.

సోమవారం ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఈ వ్యవహరంపై విచారణ చేపట్టే అవకాశం ఉంది. బార్ అసోసియేషన్ లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా తీసుకుందన్న విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర భూగర్భ, గనులు, రెవెన్యూ, హోం, రవాణాశాఖల ఆదేశాల మేరకు గత నెల 24న ఆగమేఘాల మీద క్వారీల కోసం ప్రభుత్వం నుంచి పర్మిషన్ పొందిన ౪ సంస్థలతోపాటు ఐదుగురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. నాలుగు సంస్థలకు సంబంధించిన ఇసుక క్వారీలను నిలిపివేశారు. భూయజమానులను కూడా అధికారులు బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు.

రాష్ట్రంలోనే తొలిసారి ఇసుక అక్రమాలపై సుమోటో కేసు

రాష్ట్ర హైకోర్టు చరిత్రలో ఇసుక అక్రమాలకు సంబంధించి సుమోటోగా కేసు నమోదవ్వడం ఇదే తొలిసారి. గత పదేళ్లుగా ఇసుక అక్రమ రవాణా.. లక్షల రెట్లు అధికంగా సాగిన ఎవరు ఫిర్యాదు చేయకపోవడంతో కామారెడ్డి జిల్లాలో అక్రమార్కులు ఆడిందే ఆటగా సాగింది. వారికి అధికారులు వత్తాసు పలికి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు.

ఈ విషయాన్ని హైకోర్టు సీరియస్‌గా తీసుకొన్నది. ఇప్పటికే జిల్లా ఇంచార్జి మైనింగ్ ఏడీ నగేశ్ సెలవుపై వెళ్లారు. ఎవరి మెడకు ఈ వ్యవహరం చుట్టుకుంటుందోననే భయం నెలకొంది. గత కలెక్టర్ బదిలీపై వెళ్లారు. ఎస్పీ సింధూశర్మ కొనసాగుతున్నారు. ఈ కేసులో రాష్ట్ర ఉన్నతాధికారులనూ భాగస్వాములను చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.  

ప్రతివాదులుగా రాష్ట్ర, జిల్లా, మండలాధికారులు 

ఈ వ్యవహారంపై సుమోటోగా కేసు నమోదు చేసిన హైకోర్టు.. ప్రతివాదులు గా భూగర్భ, గనులు, రెవెన్యూ, హోం, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శులు, గనుల శాఖ ఎండీ, సహయ డైరెక్టర్, కామారెడ్డి కలెక్టర్, ఎస్పీ, బిచ్కుంద తహసీల్దార్‌లను చేర్చింది.