calender_icon.png 17 January, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రవిప్రకాశ్‌కు హైకోర్టు నోటీసులు

03-09-2024 12:43:59 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): నిధుల దుర్వినియోగం, ఫోర్జరీ తది తరాలపై టీవీ9 మాజీ డైరెక్టర్ వీ రవిబాబు అలియాస్ రవిప్రకాశ్ తోపాటు పలువురిపై నమోదైన కేసు ఉపసంహరణ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు రవి ప్రకాశ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు ఉపసంహరణ నిమిత్తం పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతిస్తూ కూకట్‌పల్లి మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ అలందా మీడియా అండ్ ఎంటర్టయిన్‌మెం ట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పీ కౌశిక్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై జస్టిస్ ఈవీ వేణుగోపాల్ సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టీ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ రవిప్రకాశ్‌పై ఉన్న క్రిమినల్ కేసును ఉపసంహరించుకుంటూ మార్చి 15న ప్రభుత్వం జీవో 158 జారీ చేసిందని అన్నారు. దీని ఆధారంగా కేసు ఉపసంహరణ నిమిత్తం పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాఖలు చేసిన మెమోను అనుమతిస్తూ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేయడం సరికాదన్నారు.

కేసు పూర్వాపరాలను పరిగణనలోకి తీసుకోకుండా యాంత్రికంగా మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అభియోగ పత్రంలోని ఆధారాలను, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోకుండా కేసు ఉపసంహరణకు అనుమతించడం చట్టవిరుద్ధమన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వానికి, రవిప్రకాశ్, సొంటినేని శివాజీ, ఎంకేవీఎన్ మూర్తి, జే కనకరాజు, జే తేజవర్మ, మహేశ్ గాంధీలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 5వ తేదీకి వాయిదా వేశారు.