హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): హైదరాబాద్ నాంపల్లిలోని 45వ వార్డు పార్కు స్థలంలో ప్రైవేటు కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టడంపై జీహెచ్‌ఎంసీకి సోమవారం హైకోర్టు నోటీసులు జారీచేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. నాంపల్లి సర్వే నం.24లో పార్కును ధ్వంసం చేసి కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ షాహినాథ్ గంజ్‌కు చెందిన రహీం బిన్ హుస్సేన్ పిల్ వేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్ కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ .. పార్కు స్థలంలో డీ హనుమదాస్ అనే వ్యక్తి కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని చేపట్టారని అన్నారు. దీనిపై అధికారులకు రెండు సార్లు వినతిపత్రం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని చెప్పారు. ప్రతివాదులైన జీహెచ్‌ఎంసీ కమిషనర్, సహాయ సిటీ ప్లానర్, డిప్యూటీ కమిషనర్, నాంపల్లి తహశీల్దార్, షాహినాథ్‌గంజ్ ఇన్స్పెక్టర్, డీ హనుమాన్ దాస్‌కు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.