- ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలతోపాటుగా..
- మధ్యంతర ఉత్తర్వుల జారీకి ధర్మాసనం నిరాకరణ
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎన్నికై అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో శాసనసభాపతితోపాటు పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.
బీఆర్‌ఎస్ శాసన సభ్యులు దానం నాగేందర్, బీ కృష్ణమోహన్‌రెడ్డి, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య, టీ ప్రకాశ్ గౌడ్, ఎం సంజయ్‌కుమార్, జీ మహిపాల్‌రెడ్డి, అరెకపూడి గాంధీలతోపాటు తొలి ప్రతివాదిగా ఉన్న స్పీకర్, శాసనసభ కార్యదర్శి, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం స్పీకర్ నేతృత్వం వహించే ట్రిబ్యునల్ చైర్మన్, కేంద్ర ఎన్నికల సంఘాలకు కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని చీఫ్ జస్టిస్ అలోక్ అరాథే, జస్టిస్ జే శ్రీనివాసరావులతో కూడిన డివిజన్ బెంచ్ వారందరినీ ఆదేశించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వుల జారీకి ధర్మాసనం నిరాకరించింది.
ప్రజా తీర్పును కాలరాస్తూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై తక్షణమే అనర్హత వేటు వేయాలంటూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ (కిలారి ఆనంద పాల్) దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై (పిల్) సోమవారం ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. కేఏ పాల్ వ్యక్తిగతంగా హాజరై వాదనలు వినిపిస్తూ, పార్టీ పిరాయింపులకు పాల్పడిన వాళ్లపై తక్షణమే అనర్హత వేటు వేయాలని కోరారు. ఇదే అంశంపై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల ప్రతిని ధర్మాసనానికి అందజేశారు. ప్రజలు పార్టీ మ్యానిఫెస్టోను చూసి ఓట్లు వేశారని, ఒక పార్టీ తరఫున గెలిచి మరోపార్టీకి మారడం తీవ్రంగా పరిగణించాలని కోరారు.
బిజినెస్‌గా మారిపోయింది
తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులకు పాల్పడటం ఒక వ్యాపారంగా మారిపోయిందని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోతే ప్రజాతీర్పుకు అర్ధం లేకుండాపోతుందన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు జీతభత్యాలు చెల్లిం చకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిగి తీర్పు వెలువడేవరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలను శాసనసభలోకి ప్రవేశించకుండా స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు ఇవ్వాలన్నారు. అంతేకాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేలు చట్టసభలో ఓటింగ్‌లో పాల్గొనే అర్హత లేకుండా చేయాలని కూడా కోరారు.
వాళ్ల వేతనాలను కూడా నిలుపుదల చేయాలన్నారు. ఇలాంటి మధ్యంతర ఉత్తర్వులను జారీచేస్తేనే ఫిరాయింపుదారుల్లో భయం ఉంటుందని, మరొకరు పార్టీ ఫిరాయింపునకు ముందుకురారని చెప్పారు. అయిదేళ్ల పదవీకాలం ముగిసేవరకు ఫిరాయింపునకు పాల్పడిన చట్టసభ సభ్యులపై చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికే మాయని మచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఫిరాయింపుదారుల్లో దానం నాగేందర్ మరో అడుగు ముందుకు వేసి బీఆర్‌ఎస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారని చెప్పారు.
ఇంతజరిగినా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యల్లేవన్నారు. దా నం నాగేందర్ ఇతరులపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వెంటనే చర్యలు తీసుకునేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరించిన ధర్మాసనం, పదిమంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యలతోపాటు ఈసీ, స్పీకర్ సారథ్యం వ్యవహరించే ట్రిబ్యునళ్లకు నోటీసులు జారీ చేసింది.
మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరణ
బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యేలను శాసనసభలోకి అనుమతించకుండా, ఓటింగ్‌లో పాల్గొనకుండా మధ్యంతర ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌పై విచారణ ముగిసే వరకు ఫిరాయింపు ఎమ్యెల్యేలు శాసనసభలోకి ప్రవేశించకుండా, అసెంబ్లీలో ఎలాంటి ఓటింగ్‌లో పాల్గొనకుండా ఉత్తర్వుల జారీకి కూడా నిరాకరించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల వేతనాలు నిలిపివేయాలన్న అభ్యర్థన నూ తోసిపుచ్చింది. వాదనల తర్వాత హైకో ర్టు, అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయో లేదో, భవిష్యత్తులో ఎప్పుడు నిర్వహిస్తారనే వివరాలు పిటిషనర్ వివరించనున్నందున మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.