calender_icon.png 20 September, 2024 | 5:18 AM

రఘునందన్‌కు హైకోర్టు నోటీస్

20-09-2024 02:36:42 AM

మీడియా సమావేశంలో ఎంపీ వ్యాఖ్యలపై ఆగ్రహం

న్యాయవ్యవస్థను కించపరిచారని కోర్టు జడ్జి లేఖ

సుమోటో కోర్టు ధిక్కరణ పిటిషన్‌గా తీసుకున్న హైకోర్టు

వివరణ ఇవ్వాలని బీజేపీ ఎంపీకి ఆదేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): మీడియా సమావేశంలో న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మెదక్ ఎంపీ రఘునందన్‌రావుపై హైకోర్టు ఆగ్ర హం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యలున్నా యని పేర్కొంది. మీడియా సమావేశం నిర్వహించి న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు న్యాయమూర్తి రాసిన లేఖను హైకోర్టు సుమోటో క్రిమినల్ కోర్టు ధిక్కరణ పిటిషన్‌గా తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం గురువా రం విచారణ చేపట్టి కోర్టు ధిక్కరణగా ఎందుకు పరిగణించరాదో వివరణ ఇవ్వాలని రఘునందన్‌రావుకు నోటీసులు జారీ చేసింది. 

హైకోర్టుకు న్యాయమూర్తి లేఖ

ఎన్ కన్వెన్షన్ కూల్చివేత నేపథ్యంలో ఆగస్టు 24న ఎంపీ రఘునందన్రావు మీడియా సమావేశం నిర్వహించి న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని న్యాయమూర్తి హైకోర్టుకు లేఖ రాశారు. ఎన్‌కన్వెన్షన్‌ను కూల్చివేయాలని 2014లో ఒక న్యాయమూర్తి ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రస్తుతం స్టే ఎలా ఇస్తారని న్యాయవ్యవస్థను రఘునందన్‌రావు ప్రశ్నించారని ఆ లేఖలో పేర్కొన్నారు. న్యాయమూర్తులు కళ్లకు గంతలు తీసి చుట్టూ జరుగుతున్నవాటిని పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేయాలని విమర్శలు చేశారని తెలిపారు.

న్యాయవాదులు పలు మధ్యంతర పిటిషన్లు దాఖలు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు పొందుతున్నారని, రిజిస్ట్రీ ఈ కేసులను మళ్లీ విచారణకు లిస్ట్ చేయడంలేదని, వీటిపై ప్రధాన న్యాయమూర్తి విచారించాలని ఆరోపణలు చేశారని లేఖలో పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై చేస్తున్న వ్యాఖ్యలపై ఓ విలేకరి అభ్యంతరం వ్యక్తం చేసినా అలా మాట్లాడే హక్కు తనకు ఉందని, న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడంలేదని, చట్టాల గురించి తెలుసుకోవాలని సూచించే న్యాయమూర్తులు కూడా తెలుసుకోవాలి కదా అని వ్యాఖ్యానించారని తెలిపారు.

రఘునందన్ న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా పలు మీడియా సమావేశాలు నిర్వహించారని, న్యాయవ్యవస్థ పట్ల అగౌరవాన్ని కలిగి ఉన్నారని లేఖలో వివరించారు. ఇలాంటివాటిని విస్మరిస్తే న్యాయస్థానం ప్రతిష్ఠ మసకబారుతుందని, రూల్ ఆఫ్ లా అమలుకు కూడా ఆటంకాలు ఎదురవుతాయని తెలిపారు. న్యాయమూర్తి రాసిన ఈ లేఖను హైకోర్టు తీవ్రంగా పరిగణించి సుమోటో క్రిమినల్ కోర్టు ధిక్కరణ పిటిషన్‌గా స్వీకరించి విచారణ చేపట్టింది.

హైడ్రా కేసును కొట్టివేయండి

హైకోర్టుకు చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): హైడ్రా ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ చందానగర్ సర్కిల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నందగిరి సుధాంశ్ హైకోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు. గతంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టు కొట్టి వేసిందని, అందువల్ల హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. శేరిలింగంపల్లి మండలం మదీనాగూడ గ్రామంలోని ఈర్ల చెరువు బఫర్‌జోన్‌లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం, వాటిని అడ్డుకోవడంలో విఫలమైన అధికారులపై హైడ్రా కమిషనర్ ఫిర్యాదు చేశారు.