calender_icon.png 8 January, 2025 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మకుంటపై హైకోర్టు కీలక తీర్పు

08-01-2025 12:51:17 AM

  1. ఎడ్ల సుధాకర్‌రెడ్డి పిటిషన్‌ను డిస్మిస్ చేసిన న్యాయస్థానం
  2. హైడ్రా లీగల్ టీమ్‌ను సన్మానించిన కమిషనర్ రంగనాథ్
  3. త్వరలో చెరువు పునరుద్ధరణకు చర్యలు

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7 (విజయక్రాంతి): అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట పునరుద్ధరణపై హైడ్రాకు అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. మంగళవారం ఇచ్చిన తుది తీర్పులో సంబంధిత స్థలాన్ని బతుకమ్మ కుంటగానే గుర్తించింది. బతుకమ్మకుంట స్థలం తమదంటూ  ఎడ్ల సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేవేసింది.

అగ్రిమెంట్ ఆఫ్ సేల్ మీద గత 3 దశాబ్దాలుగా తనదిగా చెబుతున్న ఎడ్ల సుధాకర్‌రెడ్డికి హైకోర్టులో మంగళవారం చుక్కెదురైంది. బతుకమ్మ కుంట చెరువు పునరుద్ధరణలో హైడ్రా చర్యలు సక్రమమేనంటూ తీర్పు వెలువరించింది. కాగా అంబర్‌పేటలో బతుకమ్మ కుంటను పునరుద్ధరించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు హైడ్రాను సంప్రదించడంతో పాటు సంబంధిత పత్రాలను కూడా అందజేసిన విషయం విదితమే.

చెరువుల పునరుద్ధరణలో భాగంగా గతేడాది నవంబరు 13వ తేదీన అబర్‌పేటలోని బతుకమ్మకుంటను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సందర్శించగా అదేరోజు పునరుద్ధరణకు హైడ్రా చర్యలు ప్రారంభించిన విషయం విదితమే. ఆ తర్వాత హైడ్రా, రెవెన్యూ, ఇరిగేషన్, సంబంధిత శాఖ అధికారులు  సర్వే నంబరు 563లో ఉన్న భూ రికార్డులను పరిశీలించి కోర్టులో కౌంటర్ దాఖలుచేయగా..

ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కరరెడ్డి పిటిషనర్ అయిన ఎడ్ల సుధాకర్‌రెడ్డికి ఈ భూమిపై ఎలాంటి హక్కులేదని తీర్పుచెప్పారు. అది బతుకమ్మ కుంటగానే నిర్ధారించారు. బతుకమ్మకుంటపైన 2017 సంవత్సరంలో హైకోర్టు డబుల్ బెంచ్.. అది చెరువుగానే తీర్పును వెలువరించింది. ఫిర్యాదుదారుడికి ఏమైనా హక్కులుంటే సివిల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. 

బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం.. 

1962- లెక్కల ప్రకారం బతుకమ్మ కుంట మొత్తం 14.06 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. బఫర్ జోన్‌తో కలిపి మొత్తం వైశాల్యం 16.13 ఎకరాల విస్తీర్ణం అని అధికారులు తేల్చారు. తాజా సర్వే ప్రకారం అక్కడ 5.15 ఎకరాల భూమి మాత్రమే ఉంది.  ప్రస్తుతం మిగిలి ఉన్న 5.15 ఎకరాల విస్తీర్ణంలోనే బతుకమ్మ కుంటను పునరుద్ధరిం  హైడ్రా చర్యలు తీసుకుంటోంది.

ప్రస్తుతం అక్కడ నివాసం ఉంటున్న వారికి ఎలాంటి  ముప్పు లేకుండా చెరువు తవ్వకానికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలిచ్చారు. కుంట చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. 

ఒకప్పటి ఎర్రకుంటనే.. కాలక్రమంలో బతుకమ్మ కుంటగా మారిందని స్థానికులు,  రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి.  కాలక్రమంలో బతుకమ్మకుంటలో చెత్త, నిర్మాణ వ్యర్థాలు పోయడంతో చెరువు ఆనవాళ్లు కోల్పోయింది.

హర్షం వ్యక్తం చేసిన హైడ్రా కమిషనర్ 

బతుకమ్మకుంటపై హైకోర్టు తీర్పు పట్ల హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున సంబంధిత పత్రాలను కోర్టుకు సమర్పించి.. అనుకూలమైన తీర్పు రావడంలో కృషిచేసిన హైడ్రా లీగల్ బృందంతో పాటు, రెవెన్యూ ఉద్యోగులను మంగళవారం హైడ్రా ప్రధాన కార్యాలయంలో ఆయన సన్మానించారు.

హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్ కే రవీందర్‌రెడ్డి, సీహెచ్ జయకృష్ణ, హైడ్రా న్యాయ సలహాదారుడు శ్రీనివాస్, హైడ్రా లీగల్ విభాగం లైజినింగ్ అధికారి డీ మోహన్, హైడ్రా డిప్యూటీ కలెక్టర్ సుధ, తహసీల్దార్ హేమామాలిని,  తహసీల్దార్ పీ విజయ్ కుమార్, అంబర్‌పేట తహసీల్దార్ బీ వీరాబాయి, సర్వేయర్ కిరణ్‌తో పాటు పలువురు అధికారులను ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు.