calender_icon.png 3 March, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్టీప్లెక్స్‌లకు హైకోర్టు ఊరట

02-03-2025 12:31:19 AM

రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌లకు హైకోర్టు ఊరట కల్పించింది. 16 ఏళ్ల లోపు పిల్లలను కూడా అన్ని షోలకు అనుమతించాలని తాజాగా తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.

టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై ఇటీవల హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడు పడితే అప్పుడు పిల్లలను షోలకు తీసుకెళ్లడం వల్ల వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని పిటిషనర్ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. న్యాయవాది వాదనలతో న్యాయ స్థానం సైతం ఏకీభవించింది.

ఈ క్రమంలోనే రాత్రి 11 నుంచి ఉదయం 11 గంటల వరకూ పదహారేళ్లలోపు పిల్లలకు అనుమతించడానికి వీల్లేదంటూ ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఉత్తర్వులపై మల్టీప్లెక్స్ యాజమాన్యం మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఆదేశాల కారణంగా తాము ఆర్థికంగా నష్టపోతున్నామని.. కాబట్టి ఆంక్షలను ఎత్తివేయాలని కోరింది. వారి వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం తీర్పును సవరించింది.