హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్ తలపెట్టిన గిరిజన రైతు ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 25న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించుకోవాలని, వెయ్యి మందికి మించి పాల్గొనకూడదని పలు షరతులు విధించింది. ఇతరులను రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, నేరచరిత్ర ఉన్న వారు పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీని ఆదేశించింది.
ఫార్మా పరిశ్రమల కోసం భూసేకరణను వ్యతిరేకిస్తున్న లగచెర్ల గ్రామస్థులపై వికారాబాద్ పోలీసులు చేసిన దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఈ నెల 21న మహబూబాబాద్ ఎమ్మార్వో కార్యాలయం ముందు గిరిజన రైతు ధర్నా నిర్వహించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. దీని కోసం అనుమతి కోరుతూ మహబూబాబాద్ సబ్ డివిజనల్ ఆఫీసర్‌కు పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా నిరాకరించారు. అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ యూత్ ప్రెసిడెంట్ యాళ్ల మురళీధర్ హైకోర్టులో లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ బీ విజయేసేన్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎం రూపేందర్ వాదనలు వినిపిస్తూ.. శాంతియుత నిరసనకు అనుమతి నిరాకరించడం చట్టవిరుద్ధమని అన్నారు. ఈ నెల 25న ధర్నా నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి అంగీకరించిన న్యాయమూర్తి.. పలు షరతులతో అనుమతి ఇస్తూ విచారణ వాయిదా వేశారు.