హైదరాబాద్,(విజయక్రాంతి): నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై బుధవారం హైకోర్టు తీవ్ర ఆగ్రహించింది. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించట్లేదని దాఖలైన పిటిషన్ పై సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. దీంతో వారంలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులేం చేస్తున్నారు..?, నిద్రపోతున్నారా..? అని హైకోర్టు ప్రశ్నించింది. స్కూల్ లో ఫుడ్ పాయిజన్ చాలా సీరియస్ అంశమన్న సీజే, పిల్లలు చనిపోతేగాని స్పందించరా అని మండిపడ్డింది.
అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని, ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. వారంలో కౌంటర్ వేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై కోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాలు సేకరణకు వారం వ్యవధి ఎందుకు అని, కోర్టులు ఆదేశిస్తేనే అధికారులు పని చేస్తారా..? అని చురకలు అంటించింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే అధికారులు 5 నివిషాల్లో హాజరవుతారన్న హైకోర్టు, వారికి కూడా పిల్లలున్నారు కదా..? వారి పిల్లలను కూడా ఇలాగే వదిలేస్తారా..? అన్న ధర్మాసనం ఇప్పటికైన అధికారులు మానవతా దృక్పథంలో వ్యవహరించాలని కోర్టు హెచ్చరించింది.
దీంతో భోజనం విరామం తర్వాత పూర్తి వివరాలు అందిస్తామని ఏఏజీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో తరచూగా భోజనం వికటిస్తోందని న్యాయవాది చెప్పడంతో భోజన విరామం తర్వాత మరోసారి హైకోర్టు విచారణ నిర్వహించనుంది. ఇప్పటికే ఈ ఘటనపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఫైర్ అయ్యారు. పాఠశాలను సందర్శించడానికి వెళ్తారనే నెపంతో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు, బిఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేయడంపై తన్నీరు హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.