calender_icon.png 27 December, 2024 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-1 అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు షాక్

26-12-2024 03:56:48 PM

హైదరాబాద్: గ్రూప్-1 అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) షాక్ ఇచ్చింది. గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. రిజర్వేషన్లు సహా పలు అంశాలపై గ్రూప్-1 అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్ ఈరోజు హైకోర్టులో విచారణకు వచ్చింది. ఇప్పటికే గ్రూప్-1 పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే వరకు గ్రూప్-1 ఫలితాలను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కాగా, జీవో నెం.29ను ఛాలెంజ్ చేస్తూ పలు రిజర్వేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గ్రూప్-1 అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తమ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగే వరకు పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు.

పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. దీంతో అభ్యర్థులు చివరి నిమిషంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. చివరి నిమిషంలో పరీక్షలను వాయిదా వేయలేమని సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది. దీనిపై హైకోర్టు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాత రేవంత్ ప్రభుత్వం గ్రూప్-1( Group-1) పరీక్షలను యథావిధిగా నిర్వహించింది. గ్రూప్-1 అభ్యర్థులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చింది. పరీక్ష ఫలితాలను నిలిపివేయాలంటూ అభ్యర్థులు వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పుతో గ్రూప్-1 ఫలితాలకు అడ్డంకి తొలగిపోయింది.

గతంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేయాలని అభ్యర్థులు హైకోర్టు సింగిల్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. సింగిల్‌ బెంచ్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. రెండు రోజుల్లోనే సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ అభ్యర్థులు డివిజన్‌ ​​బెంచ్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు వేసిన పిటిషన్‌ను కూడా డివిజన్ బెంచ్ కొట్టివేసింది. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుతో డివిజన్‌ ​​బెంచ్‌ ఏకీభవించింది.  దీంతో గ్రూప్-1 పరీక్షలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయి తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) పరీక్షలు నిర్వహించింది. ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.  రిజర్వేషన్లు తేలే వరకు గ్రూప్-1 పరీక్షల ఫలితాలను నిలిపివేయాలని అభ్యర్థులు మరోసారి హైకోర్టును ఆశ్రయించడంతో అక్కడ కూడా నిరాశే ఎదురైంది. అభ్యర్థులు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను హైకోర్టు ఈరోజు కొట్టివేసింది