హైదరాబాద్ నవంబర్ 12 (విజయక్రాం తి): హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సుల్తాన్ ఉల్ ఉలూం ఎడ్యుకేషనల్ సొసైటీ అనుమతులను ఏఐసీటీఈ రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి హైకోర్టు మంగళవారం నిరాకరించింది. సొసైటీ ఇంజినీరింగ్ తదితర కాలేజీల అనుమతులను రద్దును సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు వల్ల విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లడంలేదని, అందువల్ల మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాల్సిన అవసరంలే దంటూ తేల్చి చెప్పింది. ఒకవేళ ఏఐసీటీఈ వల్ల ఏవైనా ఇబ్బంది ఎదురైతే ఈ కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది.
విద్యాసంస్థలు ఉన్న భూమికి సంబంధించిన యాజ మాన్య, స్వాధీన పత్రాలను సుల్తాన్ ఉల్ ఉలూం ఎడ్యుకేషనల్ సొసైటీ సమర్పించకపోవడంతో నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అనుమతులు రద్దు చేసింది. దీనిపై సుల్తాన్ ఉల్ ఉలూం సంస్థతోపాటు దాని ఆధ్వర్యంలోని కాలేజీలు వేర్వేరుగా 2017లో మూడు పిటిషన్లు దాఖలు చేశా యి.
వీటిపై విచారించిన సింగిల్ జడ్జి అనుమతులను రద్దు చేస్తూ ఏఐసీటీఈ ఇచ్చిన ఉత్తర్వులు సబబేనంటూ ఇటీవల తీర్పు వెలువరించారు. దీన్ని సవాల్ చేస్తూ సుల్తాన్ ఉల్ ఉలూం ఎడ్యుకేషనల్ సొసైటీ, విద్యాసంస్థలు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
సొసైటీ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ 2017-18 ఏఐసీటీఈ అనుమతులు రద్దు చేయగా సింగిల్ జడ్జి స్టే ఇచ్చారని, ఈ ఉత్తర్వులను ఇదే హైకోర్టు డివిజన్ బెంచ్‌తోపాటు సుప్రీం కోర్టు సమర్థించాయన్నారు.
ప్రస్తుతం సింగిల్ జడ్జి ఉత్తర్వులతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని, సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలిపివేయాలని కోరారు. అనుమతుల మంజూరుకు భూమి పై యాజమాన్య హక్కులు అవసరం లేదన్నారు. ఆ భూములను అప్పీలుదారు కొనుగోలు చేశారని చెప్పారు.
ఏఐసీటీఈ తరఫు సీనియర్ న్యాయవాది కే వివేక్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం భూమి హక్కుల కు సంబంధించిన పత్రాలతోపాటు భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు సింగిల్ జడ్జి రక్షణ కల్పించారని, వారి అడ్మిషన్లపై ఎలాంటి ప్రభావం పడదని చెప్పారు.
ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం 2017-18 విద్యాసంవత్సరం నుంచి ప్రస్తుతం అడ్మిషన్లు పొందిన విద్యార్థుల భవిష్యత్తు సింగిల్ జడ్జి ఉత్తర్వుల వల్ల ఎలాంటి నష్టం లేదని, అందువల్ల స్టే అవసరం లేదంటూ విచారణను వాయిదా వేసింది.