calender_icon.png 30 April, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లో భగ్గుమంటున్న విబేధాలు

30-04-2025 01:21:56 AM

కరీంనగర్ తరహాలో సిరిసిల్లలో రసాభాసా

హైకమాండ్ సీరియస్

కరీంనగర్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): కాంగ్రెస్ లో గ్రూపు విభేదాలు బహిర్గత మవుతుండడంతో హైకమాండ్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాపై సీరియస్ గా దృష్టిసారించింది. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాల యంలో సోమవారం జరిగిన పార్టీ సమావేశం తోపులాటకు దారితీసిన సంఘటన మరువకముందే మంగళవారం సిరిసిల్లలో రసాభాసా చోటు చేసుకుంది. సిరిసిల్లలో ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ర్ట ఇంచార్జి విశ్వనాథన్ ఎదుటే గొడవకు దిగారు. కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అల్లుడైన ఉమేష్ రావు సమావేశంలో మాట్లాడుతూ ఓడిపోతున్న వారికే టికెట్ ఇస్తున్నారన అనడంతో ఉమేష్ రావు సమావేశం నుండి వెళ్లిపోవాలంటూ ఆందోళనకు దిగిన కేకే మహేందర్రెడ్డి అనుచర వర్గం గందరగోళంగా మారింది.

సిరిసిల్ల నియోజకవర్గంలో ఈ పదేళ్లలో ఒక్క ఎంపీటీసీ స్థానాన్ని పార్టీ గెలవలేకపోయిందని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వరుస విజయాలను నిలువరించలేకపోతున్నామని, ఇక్కడ నాయకత్వ లోపం ఉందని మాట్లాడుతున్న క్రమంలో నియోజకవర్గ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి అనుచరులు అడ్డుతగిలారు. ఇదికాస్త రసాభాసాగా మారడంతో సీనియర్ నాయకులు ఉమేష్ రావుకు నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. .కొద్దిసేపటి వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఉమేష్ రావు ఏనాడు పార్టీ గురించి నియోజకవర్గంలో పర్యటించలేదని, అలాంటి వ్యక్తి ఇక్కడ పార్టీ పనితీరు గురించి మాట్లాడడమేంటని కేకే అనుచరులు ప్రశ్నించారు.

సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వనాథన్ ఎదుటే నేతలు బాహాబాహీగా దిగుతుండడంతో హైకమాండ్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టిసారించింది. సోమవారం జరిగిన సంఘటనలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి పురుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతున్న క్రమంలో మంత్రి పొన్నం అనుచరులు అడ్డుతగలడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటన అనంతరం మంగళవారం గాంధీభవన్ కు వెళ్లి ఆర్టీఏ సభ్యుడు పడాల రాహుల్ పై పురుమల్ల శ్రీనివాస్ ఫిర్యాదు చేయగా, పురుమల్ల శ్రీనివాస్ పై రాహుల్ తోపాటు మరికొంతమంది ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుల పరంపర కొనసాగుతున్న క్రమంలోనే మంగళవారం సిరిసిల్ల సభ రసాభాసాగా మారడంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ప్రక్షాళన వైపుగా పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ రెండు ఘటనలపై ఏఐసీసీకి విశ్వనాథన్ ఇచ్చే నివేదికపైనే చర్యలు ఉండబోతాయని తెలు స్తుంది. ఒకపక్క బీఆర్‌ఎస్ శ్రేణులు కదనోత్సాహంతో ఐక్యంగా ముందుకెళ్తుంటే కాం గ్రెస్ శ్రేణులు కలహాలతో ముందుకెళ్తుండడంతో ఆ పార్టీ నాయకులకు ఆందోళన కలి గిస్తున్నది. జగిత్యాల, పెద్దపల్లిలో జరిగే సమావేశాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చూడాలి. పార్టీ పెద్దనాయకులలో సయోధ్య లేకపోవడం, గ్రూపుల వారీగా రాజకీయాలు చేస్తుండడం వీటంతటికి కారణమని పార్టీ సీనియర్లు వాపోతున్నారు.