ఇజ్రాయెల్ రక్షణమంత్రి
న్యూఢిల్లీ, అక్టోబర్ 30: ఇజ్రాయెల్ వరుసదాడులతో హెజ్‌బొల్లా, హమా స్ అగ్రనేతలు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హెజ్‌బొల్లా కొత్త చీఫ్‌గా షేక్ నయీం ఖాసీం నియమితులయ్యారు. దీనిపై ఇజ్రాయెల్ రక్షణమంత్రి యోవ్ గాలంట్ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. కొత్త చీఫ్ ఎంతో కాలం ఉండడంటూ ఆయన పరోక్షంగా హెచ్చరించారు. షేక్ ఖాసీం ఫొటోను షేర్ చేసిన గాలంట్ ‘ఇది తాత్కాలిక నియామకమే. సుదీర్ఘకాలానికి కాదు’ అని పేర్కొన్నారు. దీంతో వచ్చే రోజుల్లో ఖాసీంను టార్గెట్ చేసి ఐడీఎఫ్ భీకరదాడులు చేయొచ్చని సంకేతాలిచ్చారు. బీరుట్‌లోని దాహియా ప్రాంతంలో ఉన్న హెజ్‌బొల్లా కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిలో హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఇటీవల మృతిచెందాడు. నస్రల్లా మరణం తర్వాత హెజ్‌బొల్లా కొత్త చీఫ్ ఎవరన్న దానిపై చర్చ జరగగా.. ఆ మిలిటెంట్ సంస్థ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ఖాసీంను ఎన్నుకున్నారు.