calender_icon.png 1 October, 2024 | 3:56 AM

వారంలోనే హెజ్బొల్లా ఖతం

01-10-2024 01:58:29 AM

చీఫ్ నస్రల్లా సహా ఏడుగురు అగ్రనేతల హతం

పక్కా ప్లాన్‌తో దాడులు చేసిన ఇజ్రాయెల్

సంస్థలో ఏర్పడిన రాజకీయ శూన్యం

హెజ్బొల్లా మనుగడపై మొదలైన అనుమానాలు

తదుపరి కార్యాచరణపై కొనసాగుతున్న చర్చలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ చేసిన ప్రణాళికబద్ధమైన దాడితో వారం రోజుల్లోనే ఏడుగురు అగ్రనేతలు హతమయ్యారు. వరుస దాడులతో హెజ్బొల్లాను ఇజ్రాయెల్ ఉక్కిరిబిక్కిరి చేసింది.

కేవలం ఏడు రోజుల్లోనే హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాతో పాటు ఏడుగురు టాప్ కమాండర్లను హతమార్చింది. కీలక నేతలు మరణించడంతో సంస్థలో నాయకత్వ కొరత ఏర్పడింది. అగ్రనేతల మరణాలు సంస్థకు పెను సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో కొత్త నాయకత్వం ఎంపికపై సంస్థ మల్లగుల్లాలు పడుతోంది.

త్వరలోనే హెజ్బొల్లా షురా కౌన్సిల్ సమావేశమై కొత్త నాయకత్వంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గాజాలోని హమాస్‌తో చేతులు కలిపి దక్షిణ ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో యూదు దేశం హెజ్బొల్లాపై దాడుల తీవ్రతను పెంచింది. ఈ క్రమంలోనే పేజర్, వాకీటాకీల పేలుళ్లు సైతం జరిగాయి. 

నబిల్ కావూక్

నస్రల్లా మరణించిన మరుసటి రోజే మరో కీలక నేత నబిల్ కావూక్‌ను ఇజ్రాయెల్ చంపేసింది. నబిల్ కావోక్ 1980లోనే హెజ్బొల్లాలో చేరి నస్రల్లాకు కుడిభుజంగా వ్యవహరించారు. దక్షిణ లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటరీ ఆపరేషన్లలో చురుకుగా పాల్గొన్న నబిల్‌పై అమెరికా 2020లో ఆంక్షలు విధించింది. 1995 నుంచి 2010 వరకు మిలిటరీ కమాండర్‌గా నబిల్ పనిచేశాడు. అనేకసార్లు మీడియా ముందుకు వచ్చి మద్దతుదారులకు అనుకూలంగా మాట్లాడాడు. నస్రల్లా తర్వాత అతని వారసుడు అవుతాడని చాలా మంది భావించారు. 

అలీ కరాకీ

హెజ్బొల్లా దక్షిణ ఫ్రంట్ కమాండర్ అలీ కరాకీ సైతం వైమానిక దాడిలోనే మృతిచెందాడు. అతను జిహాద్ కౌన్సిల్‌తో పాటు అగ్ర సైనిక విభాగం సభ్యుడు కూడా. కానీ, కరాకీ చనిపోయినట్లు హెజ్బొల్లా ధ్రువీకరించలేదు. ఒకవేళ కరాకీ మరణం నిజమైతే సంస్థ దళాల నిర్వహణకు పెద్ద దెబ్బ తగిలినట్లేనని నిపుణులు చెబుతున్నారు.

దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ భూతల దాడులకు వ్యతిరేకంగా అతని దళాలు మొదటి రక్షణ శ్రేణిగా పనిచేస్తాయని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. కరాకీపై ఇప్పటికే అమెరికా ఆర్థిక ఆంక్షల జాబితాలో కరాకీ కూడా ఉన్నాడు. 

ఇబ్రహీం అకిల్

లెబనాన్‌లో పేజర్ దాడులు జరిగిన కొద్ది రోజులకే ఇబ్రహీం అకిల్‌ను ఇజ్రాయెల్ చంపేసింది. హెజ్బొల్లా ఎలైట్ రద్వాన్ ఫోర్స్‌లో అకిల్ సీనియర్ నాయకుడు. అకిల్ చేతుల్లో అనేకమంది ఇజ్రాయిలీలు, అమెరికన్లు, ఫ్రెంచ్, లెబనీస్ ప్రజలు మరణించారని ఇజ్రాయెల్ ఆరోపించింది.

1980లలో హెజ్బొల్లాలో చేరిన అకిల్.. ఫువాద్ షుక్ తర్వాత రెండో కీలక కమాండర్‌గా కొనసాగారు. 1983లో బీరుట్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడిలో అతని పాత్ర ఉందని యూఎస్ ఆరోపించింది. అకిల్‌పై 70 లక్షల డాలర్ల రివార్డ్‌ను యూఎస్ ప్రకటించింది. జెరూసలెంలోని మసీదులో ప్రార్థనలు చేయాలనే లక్ష్యంతో అకిల్ పనిచేసేవాడని హెజ్బొల్లా చెప్పింది. 

ఇబ్రహీం ఖుబైసీ

ఇజ్రాయెల్ సెప్టెంబర్ 25న చేసిన చేసిన వైమానిక దాడుల్లో ఖుబైసీ మరణించినట్లు హెజ్బొల్లా ధ్రువీకరించింది. ఇతను హెజ్బొల్లా రాకెట్, మిస్సైల్ విభాగానికి చీఫ్‌గా వ్యవహరించాడు. 1980లో ఖుబైసీ సంస్థలో చేరి అనేక కీలక పదవులను నిర్వహించాడని ఇజ్రాయెల్ చెబుతోంది. 2000లో ముగ్గురు ఇజ్రాయెల్ సైనికుల మరణానికి కారణమైన మౌంట్ డోవ్‌లో జరిగిన కిడ్నాప్ ఘటనకు ఖుబైసీ ప్రధాన సూత్రధారి. ఖుబైసీ నేరుగా హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాతోనే టచ్‌లో ఉంటాడని సమాచారం. 

నస్రల్లా మరణంతో శూన్యం

ఇటీవల మరణించిన టాప్ కమాండ ర్లు అందరూ హెజ్బొల్లా స్థాపించిన 1980 నాటి నుంచి సంస్థలో భాగమయ్యారు. వీరంతా లెబనాన్‌లో ప్రభావవంతమైన సైనిక, రాజకీయ శక్తిగా ఎదిగారు. వీరి లో టు ప్రస్తుతం హెజ్బొల్లాకు సవాలుగా మారింది. లెబనాన్‌లోని హెజ్బొల్లా ప్రధా న కార్యాలయం లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) రెండ్రోజుల క్రితం తీవ్రమైన దాడులు చేసింది.

ఈ దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా తోపాటు ఆయన కూతురు మరణించినట్లు సంస్థ ధ్రువీకరించింది. దీంతో 3 దశాబ్దాల నస్రల్లా నాయకత్వానికి తెరపడింది. షైతే వర్గానికి చెందిన నస్రల్లా 1960లో పేద కుటుంబంలో జన్మించారు. ధార్మిక అధ్యయనం చేసిన నస్రల్లా అమల్ విప్లవంలో పాల్గొన్నారు.

అనంతరం హెజ్బొల్లా వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉన్నా రు. 1985లో అధికారికంగా హెజ్బొల్లా ఏర్పాటుపై ప్రకటన చేశారు. ఇస్లాంకు అమెరికా, సోవియట్ యూనియన్ రెండు ప్రధాన శత్రువులని, ఇజ్రాయెల్ నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశా రు. ప్రస్తుతం నస్రల్లాతో పాటు కీలక కమాండర్ల మరణంతో రాజకీయ శూన్య త్వం ఏర్పడింది. 

ఫువాద్ షుక్

ఇతను కూడా చీఫ్ నస్రల్లాకు కుడి భుజంగా వ్యవహరించాడు. జూలైలో షుక్‌న్రు చంపేశారు. 1982లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిన సమయంలో హెజ్బొల్లా వ్యవస్థాపక సభ్యుల్లో షుక్ ఒకడు. షుక్‌న్రు అమెరికా  మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చింది. 

మహమ్మద్ సురూర్

హెజ్బొల్లా డ్రోన్ విభాగానికి చీఫ్‌గా సురూర్ వ్యవహరించాడు. ఇజ్రాయెల్‌తో ప్రస్తుత ఘర్షణలో డ్రోన్లను మొదటిసారిగా హెజ్బొల్లా ఉపయోగించింది. సురూర్ నాయకత్వంలో హెజ్బొల్లా పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్లను ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను ఛేదించి లోపలికి పంపగలిగారు.