calender_icon.png 5 November, 2024 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇజ్రాయెల్‌పై హిజ్బొల్లా క్షిపణుల వర్షం

05-08-2024 02:03:23 AM

ఉత్తర ప్రాంతంలో రాకెట్లతో విరుచుకుపడిన సంస్థ

చాలావరకు నిలువరించిన ఇజ్రాయెల్ 

న్యూఢిల్లీ, ఆగస్టు 4: హమాస్, హిజ్బొల్లా కీలక నేతల హత్యల తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఇందుకు ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీసుకుంటామని ఇరాన్‌తో పాటు ఆ సంస్థలు ప్రకటించాయి. అన్నట్టుగానే ఆదివారం ఇజ్రాయెల్‌పై హిజ్బొల్లా సంస్థ రాకెట్ల వర్షం కురిపించింది.

ఉత్తర ఇజ్రాయెల్‌లోని బీట్ హిల్లెల్ నగరంపై డజన్ల కొద్దీ కటియుషా రాకెట్లను ప్రయోగించింది. కొన్ని రాకెట్లను ఇజ్రాయెల్ నిలువరించగలిగింది. ఈ దాడుల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. దాడి తామే చేసినట్లు హిజ్బొల్లా అధికారిక ప్రకటన చేసింది. కేఫర్‌కెలా, డెయిర్‌సిరియాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిందని, తమ పౌరులు గాయపడ్డారని, అందుకు ప్రతీకారంగా తాము కటియుషా రాకెట్లతో విరుచుకుపడ్డామని పేర్కొంది.  

ఇజ్రాయెల్‌కు బైడెన్ హెచ్చరిక

ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌కు రక్షణ కల్పించేందుకు అమెరికా సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే హమాస్ మిలిటెంట్ గ్రూప్ చీఫ్ ఇస్మాయిల్ హానియేను హత్య చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించినట్లు సమాచారం.

గురువారం ఇరువురి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో బైడెన్ ఘాటుగా స్పందించినట్లు ఇజ్రాయెల్‌కు చెందిన స్థానిక చానెల్ వెల్లడించింది. హమాస్‌తో కాల్పుల విమరణకు చర్చలు జరుపుతున్నామనే విషయాన్ని బైడెన్‌కు చెప్పే సమయంలో ఇది జరిగినట్లు తెలిపింది. ఇరాన్, హమాస్‌పై దాడులకు తెగబడి తర్వాత తనను అందులోకి లాగొద్దని బైడెన్ చెప్పినట్లు తెలుస్తోంది.  

ఇరాన్‌కూ వార్నింగ్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై మీడియా అడిగిన ప్రశ్నలకు బైడెన్ స్పందించారు.  ఈ విషయంలో ఆందోళన చెందుతున్నా. ఇప్పటికే నెతన్యాహూతో ప్రత్యక్షంగా మాట్లాడా. కాల్పుల విరమణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. వాటిని ఇరాన్ తట్టుకోలేదు. ఈ విషయంలో ఇరాన్ వెనక్కు తగ్గుతుందని భావిస్తున్నా. కానీ చెప్పలేం అని  బైడెన్ హెచ్చరించారు.