- గాజాలో హమాస్ నిఘా సభ్యుడి మృతి
- సిరియాలోనూ భూతల దాడులు చేశాం
- ఇజ్రాయెల్ ప్రకటన
టెల్‌అవీవ్, నవంబర్ 4: దక్షిణ లెబనాన్‌లోని బరాచిత్ ప్రాంతంలో తాము జరిపిన వైమానిక దాడుల్లో హెజ్‌బొల్లా కమాండర్ అబూ అలీ రిదాను హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడీఎఫ్ ప్రకటించింది. ఇజ్రాయెల్ దళాలపై రాకెట్, యాంటీ ట్యాంక్ క్షపణి దాడులకు అబూ కుట్ర పన్నడంతోపాటు హెజ్‌బొల్లా ఉగ్రవాద కార్యక లాపాలను పర్యవేక్షిస్తున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది.
కాగా అక్టోబర్ 7 దాడి కుట్రలో నిందితుడైన ఇస్లామిక్ జిహాదీ మిలిటరీ ఇంటెలిజెన్స్ యూనిట్ మెంబర్ అహ్మద్ అల్-దాలును కూడా గాజాలో హతమార్చినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.
యూఎన్‌తో ఒప్పందం రద్దు
గాజాలో ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ యూఎన్‌ఆర్‌డబ్ల్యూలో హమాస్ ఉగ్రవాదు లు ఉద్యోగం చేస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో గాజాలో పాలస్తీ నా శరణార్థులకు మానవతా సాయం అం దించడానికి ఇంతకాలం యూఎన్‌తో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటన్నట్లు ఇజ్రాయెల్ అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఐరాస నుంచి గాజాకు ఫుడ్, మెడిసిన్స్, వైద్య సదుపాయాల కోసం నిధులు కేటాయించడానికి వీలు పడదు. అయితే తమపై ఇజ్రాయెల్ చేసిన ఆరోపణలను యూఎన్‌ఆర్‌డబ్ల్యూ ఖండించింది.
సిరియాలోనూ భూతల దాడులు
హమాస్, హెజ్బొల్లా లక్ష్యంగా గాజా, లెబనాన్‌లో భూతల దాడులు నిర్వహిస్తున్న ఇజ్రాయెల్.. తాజాగా సిరియాలోనూ గ్రౌండ్ అటాక్స్ నిర్వహించింది. ఇరాన్ నెట్‌వర్క్స్‌తో సంబంధాలున్న వ్యక్తిని తమ అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. ఏడాది కాలంగా సిరియాపై కేవలం గగనతలం నుంచి మాత్రమే దాడులు జరిపిన ఇజ్రాయెల్ సైన్యం తొలిసారి భూతలంలో అడుగుపెట్టడం గమనార్హం.
దీనిపై సిరియా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. కానీ, సిరియా అనుకూల షామ్ ఎఫ్‌ఎం మాత్రం ఇజ్రాయెల్ బలగాలు కిడ్నాపింగ్ ఆపరేషన్ నిర్వహించి దక్షిణ ప్రాంతం నుంచి ఓ వ్యక్తిని బలవంతంగా తీసుకెళ్లినట్లు తెలిపింది. దక్షిణ సిరియాలోని సైదాలో అతను నివసిస్తున్నట్లు, అతని పేరు అలీ సులేమాన్ అస్సీగా నిర్ధారించారు.
బాడీ కెమెరా వీడియో ద్వారా సైనికులు అతన్ని అదుపులోకి తీసుకున్న దృశ్యాలను విడుదల చేశారు. విచారణ కోసం ఇజ్రాయెల్ తీసుకొచ్చినట్లు తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు లెబనాన్ సరిహద్దును ఆదివారం సందర్శించారు. హెజ్‌బొల్లా సంస్థ చేతికి ఇరాన్ నుంచి ఆయుధాలు అందకుండా చేయడంపైనే దృష్టిసారించినట్లు తెలిపారు.