calender_icon.png 25 September, 2024 | 7:54 PM

హెజ్బొల్లా కమాండర్ హతం

25-09-2024 04:17:47 AM

బీరుట్‌లోని మిస్సైల్ కేంద్రంపై ఇజ్రాయెల్ దాడిలో ఘటన

నాలుగు రోజులుగా లెబనాన్‌పై దాడులు

దాదాపు 500 మంది మృతి, వందలాది మందికి గాయాలు

సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న లెబనాన్ పౌరులు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: లెబనాన్‌పై తీవ్రస్థాయిలో ఇజ్రాయెల్ చేస్తోన్న దాడుల్లో ఉగ్ర సంస్థ హెజ్బొల్లాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీరుట్‌పై మంగళవారం ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో హెజ్బొల్లా కమాండర్ ఇబ్రహీం క్వబైసీ హతమయ్యాడు. ఈ దాడుల్లో ఇబ్రహీంతో పాటు మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్ రక్షణవర్గాలు పేర్కొన్నాయి.

హెజ్బొల్లా మిస్సైల్ వ్యవస్థకు ఇబ్రహీం కమాండర్‌గా ఉన్నాడు. మంగళవారం ఇజ్రాయెల్ దాడి చేసిన దహియే సబర్బ్ ప్రాంతం హెజ్బొల్లాకు కంచుకోట. క్షిపణి దాడులకు వ్యూహాలన్నీ అక్కడే సిద్ధమవుతాయి. ఈ ప్రాంతానికి మిస్సైల్ ఫ్యాక్టరీగా పేరుంది.  నాలుగు రోజులుగా హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ రాకెట్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది.

ఈ దాడు ల్లో 500 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఈ దాడులతో దక్షిణ లెబనాన్‌లోని గ్రామాలు వణికిపోయాయి. వేలమంది పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బీరుట్‌వైపు పారిపోతున్నారు. దీంతో రాజధానికి వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

హెజ్బొల్లా క్షిపణుల నిర్వీర్యమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రకటించింది. కేవలం క్షిపణి కేంద్రాలపైనే తాము దాడులు చేస్తున్నామని, ఇవి భవిష్యత్తుల్లోనూ కొనసాగుతాయని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.  

40 ఏళ్లుగా కోల్డ్‌వార్

పాలస్తీనియన్ వేర్పాటువాద సంస్థ (పీఎల్‌వో) నిర్మూలన కోసం 1980లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసి బీరుట్‌ను తరిమేసింది. ఈ చర్యకు ప్రతీకారంగా కొందరు పీఎల్‌వో కార్యకర్తలు 1982లో ఇజ్రాయెల్ నిఘా సంస్థ కార్యాలయం షెన్‌బెట్‌పై దాడి చేయగా దాదాపు 91 మంది అధికారులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ దాడి చేసింది తామేనని షియా ఇస్లామిస్టులు ప్రకటించుకున్నారు. ఆ తర్వాత వారంతా హెజ్బొల్లా సంస్థగా ఏర్పడ్డారు. అప్పటినుంచి ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య శత్రుత్వం కొనసాగుతోంది. వీలు చిక్కినప్పుడల్లా ప్రత్యక్ష దాడులు జరగుతున్నప్పటికీ, 40 ఏళ్లుగా వీరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది.

1983లో హెజ్బొల్లా ఏర్పాటు కాగా ఇరాన్‌తో చేతులు కలిపి సంస్థ బలపడింది. ఇరాన్ అండదండలతో అనతికాలంలోనే ఇజ్రాయెల్‌కు పక్కలో బళ్లెంగా తయారైంది. గెరిల్లా, కోవర్టు ఆపరేషన్లు చేస్తూ లెబనాన్‌లోనే కాకుండా సరిహద్దులు దాటి తన ప్రతాపాన్ని చూపించే స్థాయికి చేరింది. 80, 90 దశకాల్లో బీరుట్‌లోని అమెరికా, ఫ్రాన్స్ మిలిటరీ స్థావరాలపైనా హెజ్బొల్లా సంస్థకు చెందిన ఉగ్రవాదులు లెక్కలేనన్నీ దాడులు   చేశారు.