calender_icon.png 30 September, 2024 | 3:05 PM

హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా అమరుడు

30-09-2024 12:00:00 AM

పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ

జమ్మూకశ్మీర్, సెప్టెంబర్ 29: ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో మరణించిన ప్రముఖ ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా అమరుడని పీపుల్స్ డె మోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు.

‘లెబనాన్, గాజా అమరులు.. ముఖ్యంగా హసన్ నస్రల్లా మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ.. నా ఎన్నికల ప్రచారాన్ని ఒకరోజు(సెప్టెంబర్ 29) నిలిపివేస్తున్నాను. ఈ దుఖ సమయంలో పాలస్తీనా, లెబనాన్ ప్రజలకు మద్దతుగా నిలబడి ఉన్నాం’ అని మెహబూబా అన్నారు. 

జమ్మూకశ్మీర్‌లో నిరసనలు..

నస్రల్లా హత్యను ఖండిస్తూ జమ్మూకశ్మీర్‌లో ప్రజలు వీధుల్లోకి వచ్చి పెద్దఎత్తున నిరసన తెలిపారు. బుద్గామ్‌లో నిర్వహించిన నిరసన ర్యాలీలో మహిళలు, చిన్నపిల్లలు సహా పెద్ద సంఖ్యలో ప్రజలు నస్రల్లా చిత్రపటాలను పట్టుకొని నివాళి అర్పించారు. ఇజ్రాయిల్, అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో తమ నాయకుడు హసన్ నస్రల్లా చనిపోయినట్లు హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ శనివారం అధికారికంగా ధృవీకరించింది.