calender_icon.png 29 September, 2024 | 9:56 AM

హెజ్బొల్లా చీఫ్ హతం

29-09-2024 01:49:01 AM

  1. వైమానిక దాడిలో నస్రల్లా దుర్మరణం
  2. ధృవీకరించి ఇజ్రాయెల్ సైన్యం, హెజ్బొల్లా
  3. ఉగ్రసంస్థ కార్యాలయంపై 80 బాంబులు
  4. భీకర దాడిలో నస్రల్లా కుమార్తె కూడా మృతి
  5. వరుస దాడులో టాప్ కమాండర్లంతా మృతి

బీరుట్, సెప్టెంబర్ 28: లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న అతిపెద్ద ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లాను అంతం చేసేందుకు కంకణం కట్టుకున్న పొరుగుదేశం ఇజ్రాయెల్.. వరుసగా జరుపుతునన భీకర వైమానిక దాడుల్లో అతిపెద్ద విజయం సాధించింది.

ఆ ఉగ్రవాద సంస్థ అధినేత హసన్ నస్రుల్లాను వైమానిక దాడిలో అంతమొందించినట్లు శనివారం ప్రకటించింది. ‘న్యూ ఆర్డర్’ పేరుతో హెజ్బొల్లా టాప్ కమాండర్లను ఏరివేసే ఆపరేషన్ మొదలుపెట్టిన ఇజ్రాయెల్ వైమానిక దళం..

నస్రుల్లా హత్యతో ఆ పరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్లు వెల్లడించింది. ‘హసన్ నస్రుల్లా ఇకపై ప్రపంచాన్ని భయపెట్టలేడు’ అని ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నది. నస్రల్లా మృతిని హెజ్బొల్లా కూడా అధికారికంగా ధృవీకరించింది.

బాంబుల కుంభవృష్టి

లెబనాన్ రాజధాని బీరుట్‌లో దక్షిణప్రాంతం మొత్తం హెజ్బొల్లా ఆధీనంలో ఉంటుంది. అక్కడి దహియే ప్రాంతంలో హెజ్బొల్లా ప్రధాన కార్యాలయం ఉంటుంది. శుక్రవారం ఆ భవనంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఏకంగా 80 బాంబులను జారవిడిచినట్లు సమాచారం. ఈ భీకర దాడి దెబ్బకు ఆ భవనంతోపాటు దాని పక్కనే ఉన్న మరికొన్ని ఇండ్లు కూడా నామరూపాల్లేకుండా పోయాయి.

ఆకాశంలోకి కిలోమీటర్ల ఎత్తుకు దట్టమైన పొగ కమ్ముకోవటం కనిపించింది. బాంబు దాడి జరిగిన సమయంలో హెజ్బొల్లా నేతలతో నస్రల్లా సమావేశమైనట్లు సమాచారం. ఈ దాడిలో నస్రల్లా కుమార్తె జైనబ్ నస్రల్లా కూడా మరణించింది. ‘మా దేశానికి, మా ప్రజలకు ప్రమాదం తలపెట్టేవారు ఎక్కడ ఉన్నా మేం వారిని చేరుకోగలం.

ఇది టూల్‌బాక్స్‌కు ముగింపు కాదు’ అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలెవి ప్రకటించారు. హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ యుద్ధ విమనాలు ఒకేసారి 80 బాంబులను కుమ్మరించాయని, ఒక్కో బాంబు బరువు వెయ్యి కిలోలు ఉంటుందని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. 

ఇజ్రాయెల్‌పై పోరు ఆగదు

తమ అధినేత నస్రల్లా మృతిని హెజ్బొల్లా అధికారికంగా ధృవీకరించింది. ఈ దాడికి ఇజ్రాయెల్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. ఇజ్రాయెల్‌పై తమ పోరాటం ఆగదని ప్రకటించింది. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హెజ్బొల్లా ప్రధాన కార్యాలయం ఉన్న ప్రాంతంలో భీతావహ పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ దాడిలో ఆరుగురు చనిపోయారని, 90 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్యశాఖ ప్రకటించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని తెలిపింది. శక్తిమంతమైన బాంబుల ధాటికి చాలా భవనాలు తునాతునకలైపోవటంతో వేలమంది సామాన్య ప్రజలు నిరాశ్రయులయ్యారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. 

వరుసగా ఏరివేతలు 

గాజాలోని హమాస్‌తో సాయుధ ఘర్షణ మొదలైన తర్వాత కొంతకాలం హమాస్ టాప్ కమాండ్ల ఏరివేతపై దృష్టిపెట్టిన ఇజ్రాయెల్.. తమపైకి హెజ్బొల్లా రాకెట్ల ప్రయోగం మొదలుపెట్టిన తర్వాత ఆ సంస్థ కీలక నేతలపై గురి పెట్టింది. వరసు దాడుల్లో హెజ్బొల్లా టాప్ కమాండర్లందరినీ చంపేస్తూ వచ్చింది.

చివరకు సంస్థ అధినేతను కూడా గురి తప్పకుండా మట్టుబెట్టింది. గత జూలైలో ఒకేరోజు బీరుట్‌లో హెజ్బొల్లా కమాండర్ ఫావద్ శుక్‌న్రు చంపేసింది. సదరన్ ఫ్రంట్ కమాండర్ అలీ ఖర్కిని కూడా శుక్రవారం చంపేసింది. రాకెట్ డివిజన్ అధిపతి ఇబ్రహిం ఖుబైసీ, జిహాద్ కౌనిసల్ సభ్యుడైన ఇబ్రహిం అఖిల్, రద్వాన్ స్పెషల్ ఫోర్సెస్ నాయకుడైన అహ్మెద్ వాహబీని కూడా బాంబుదాడికి బలిచేసింది.  

ఇరాన్ అప్రమత్తం 

నస్రల్లా హత్యతో ఇరాన్ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఆ దేశ సుప్రీంలీడర్ అ యతొల్లా అలీ ఖొమేనీని గుర్తు తెలియ ని సురక్షిత ప్రాంతానికి తరలించింది. అయితే, నస్రల్లా హత్యపై ఖొమేనీ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. యూదు దేశం ఇంకా పాఠాలు నేర్చుకోవటం లేదని, ఇందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు.