- తోటపల్లికి పంపే వరకు నిద్రపోను
- ప్రభుత్వ, వక్ఫ్‌బోర్డు భూములన్నీ అమ్ముకున్నరు
- దోచుకోవడం.. దాచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు
- రుణమాఫీ చేస్తున్నాం.. రాజీనామాకు సిద్ధంగా ఉండు
- సిద్దిపేటలో మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఘాటు వ్యాఖ్యలు
సిద్దిపేట రూరల్, ఆగస్టు 2: ‘బిడ్డా హరీశ్‌రావు.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు.. రాజీనామాకు సిద్ధంగా ఉండు.. నిన్ను సిద్దిపేట నుంచి తోటపల్లికి పంపేంత వరకు నిద్రపోయే ప్రసక్తే లేదు’ అని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హన్మంతరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సిద్దిపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మైనంపల్లి మాట్లాడారు. హరీశ్‌రావును తన స్వగ్రామం తోటపల్లికి పంపించే సమయం వచ్చిందని అన్నారు. సిద్దిపేటకు వచ్చినప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో.. ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదించుకున్నాడో అందరికీ తెలిసిందే అన్నారు.
పదేళ్ల పాలనలో కేసీఆర్, హరీశ్‌రావు ప్రజలకు చేసిందేమీ లేదని, వారి కుటుంబం మాత్రం లక్షల కోట్లు సంపాదించుకుందని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, వక్ఫ్‌బోర్డు భూములు అమ్ముకున్నారని ఆరోపించారు. పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తోందని, సవాల్ మేరకు హరీశ్‌రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని సూచించారు. హరీశ్‌రావు అంటే ట్రబుల్ షూటర్.. ఈ షూటర్.. ఆ షూటర్ అన్నట్టుండే కానీ ఇప్పుడు అవేం నడవవన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం భూములు, మట్టి, ఇసుక, మెడికల్ మాఫీయాలను ప్రోత్సహించి దోచుకోవడం.. దాచుకోవడం అన్నట్టుగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కేవలం రెండు మూడు నియోజకవర్గాలే అభివృద్ధి చెందాయని, కాంగ్రెస్ పాలనలో అందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని, అసెంబ్లీ జరుగుతున్న తీరు చూస్తుంటేనే ప్రజా పాలనకు ప్రతిబింబంగా ఉందని వివరించారు. రాబోయే రోజుల్లో సిద్దిపేట నియోజకవర్గంలోని అన్ని సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపల్ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
మీడియా సమావేశంలో సిద్దిపేట, మెదక్ డీసీసీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి, అంజనేయులు గౌడ్, సిద్దిపేట, దుబ్బాక, నర్సాపూర్ నియోజకర్గాల ఇన్‌చార్జిలు పూజల హరికృష్ణ, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, రాజిరెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ల, ప్రధాన కార్యదర్శి వనజ, పార్టీ జిల్లా నాయకుడు మంద పాండు, సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తుఇమామ్, సాకి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.