calender_icon.png 1 November, 2024 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ కేసు.. ఏ10గా హీరోయిన్ రకుల్ సోదరుడు

18-07-2024 08:56:02 PM

రాజేంద్రనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నార్సింగి డ్రగ్స్ కేసులో ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల రిమాండు రిపోర్టు ఆధారంగా.. ఈ కేసులో 20 మందిని నిందితులుగా చేర్చారు. అయితే ఇందులో ఏడుగురు పెడ్లర్లు, అదేవిధంగా మిగతా 13 మందిని వినియోగదారులుగా పొందుపర్చారు. ఈ కేసులో ఏ10గా హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌ప్రీత్ సింగ్‌గా పేర్కొన్నారు.

నైజీరియా నుంచి నిందితులు ఢిల్లీ, హైదరాబాద్‌తో పాటు అంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు డ్రగ్స్ చేరవేస్తున్నట్లుగా తెలిపారు. ఎబుక, అనౌహ బ్లెసింగ్స్, ఫ్రాంక్లిన్, అజీజ్, గౌతమ్, వరుణ్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. అయితే నైజీరియన్లు పెడ్లర్లకు కావాల్సిన డబ్బులు అందజేస్తున్నారు. ఈ డ్రగ్స్ కేసులో నైజీరియాకు చెందిన ఎబుకా సుజీ కింగ్ పిన్‌గా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనౌహా బ్లెసింగ్స్ అనే మహిళ ద్వారా వివిధ ప్రాంతాలకు డ్రగ్స్‌ను గుట్టుగా చేరవేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.  ఇప్పటివరకు ఆమె ద్వారా హైదరాబాద్‌కు సుమారు 20 సార్లు డ్రగ్స్ తీసుకురావడం గమనార్హం. అదేవిధంగా గౌతమ్ అనే పెడ్లర్ ద్వారా హైదరాబాద్, రాజమహేంద్రవరం, ప్రకాశం జిల్లాకు డ్రగ్స్ చేరవేశారు.

డ్రగ్స్ చేరవేస్తున్నందుకు గాను నైజీరియన్స్ అతడికి సుమారు నెలల కాలంలో కమీషన్ డబ్బులుగా 10 లక్షలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లుంబీనీ కమ్యూనికేషన్స్ ద్వారా డబ్బు లావాదేవీలు జరిగినట్లు పేర్కొన్నారు. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో మరిన్ని అంశాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. డ్రగ్స్‌ను సమూలంగా నిలువరించేందుకు ఇప్పటికే తెలంగాణ సర్కారు, పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలు అవలంభిస్తున్న విషయం విధితమే.