05-04-2025 12:00:00 AM
‘నా అసలు పేరు నరసింహాచారి. సిద్దిపేట జిల్లా మిట్టపల్లి అనే చిన్న పల్లెటూరిలో బంగారు ఆభరణాలు తయారుచేసుకుంటున్న నేను ఈ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉంది. నేను నటించిన హృదయ కాలేయం సినిమా గురించి పదకొండేళ్లుగా ప్రేక్షకులు మాట్లాడుకోవడం ఆనందంగా ఉంది’ అన్నారు నటుడు సంపూర్ణేశ్‌బాబు. ‘హృదయ కాలేయం’ సినిమాతో బర్నింగ్ స్టార్‌గా ప్రేక్షకుల అభిమానం పొందారు సిద్దిపేట ముద్దుబిడ్డ సంపూర్ణేశ్‌బాబు. దర్శకుడు సాయిరాజేశ్ రూపొందించిన ఈ సినిమా 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కథానాయకుడు సంపూర్ణేశ్‌బాబు శుక్రవారం మీడియాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సంపూర్ణేశ్ మాట్లాడుతూ.. “సినిమా కల సాకారం చేసుకునేందుకు వందలాది మంది ప్రయత్నిస్తుంటారు. వాళ్లలో ఒకరిగా నాకు అవకాశం, గుర్తింపు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. నరసింహాచారిగా చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన నన్ను ‘హృదయకాలేయం’ సినిమాతో సంపూర్ణేశ్‌బాబుగా మార్చారు ఫిలిం మేకర్ సాయిరాజేశ్. మళ్లీ భవిష్యత్తులో కలిసి పనిచేద్దామని ఆయన నాకు మాటిచ్చారు.
ఆయన ఆ మాట నిలబెట్టుకుంటారు. ‘హృదయ కాలేయం’ రిలీజ్ టైమ్‌లో దర్శకుడు రాజమౌళి చేసిన ట్వీట్ వల్ల నాకు ఎంతో గుర్తింపు దక్కింది. ఎప్పుడు కలిసినా రాజమౌళి ‘సంపూ, ఎలా ఉన్నావ్..’ అని పలకరిస్తారు. ఆయన సినిమాలో అవకాశం వస్తే వదులుకోను. ఈ 11 ఏళ్లలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించాను. త్వరలో ‘సోదరా’ అనే సినిమాతో మీ ముందుకు రాబోతున్నా. ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. మరో రెండు సినిమాలు రిలీజ్‌కు ఉన్నాయి. కామెడీతోపాటు సీరియస్ క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నా” అని చెప్పారు.