27-03-2025 08:15:43 PM
నార్నె నితిన్, సంగీత్‌శోభన్, రామ్‌నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన తాజాచిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. గతంలో విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న ‘మ్యాడ్’కు సీక్వెల్‌గా రూపొందిందీ సినిమా. దీంతో ఈ పార్ట్2పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రానికి కళ్యాణ్‌శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించారు.
ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ సమర్పణలో ప్రేక్షకులకు వేసవి వినోదాల విందును అందించడానికి ఈ సినిమా మార్చి 28న థియేటర్లలోకి రానుంది. ప్రచారంలో భాగంగా ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినీప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ముఖ్యఅతిథిగా హాజరు కాగా, సినీ దర్శకులు మారుతి, వెంకీ అట్లూరి అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథి నాగచైతన్య మాట్లాడుతూ.. “మ్యాడ్‌స్క్వేర్’ ట్రైలర్ చూశాను. అది మ్యాడ్‌స్క్వేర్ కాదు, మ్యాడ్‌మ్యాక్స్. ఈ వేడుకకు రావడం సంతోషంగా ఉంది. నేను మ్యాడ్ సినిమాలోని కామెడీ సీన్స్ చూస్తూ, ఒత్తిడిని దూరం చేసుకుంటూ ఉంటాను. ఇలాంటి సినిమాలు ఆరోగ్యానికి చాలా మంచిది. డల్‌గా ఉన్నప్పుడు మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా సూచించాలనేది నా అభిప్రాయం. ఇలాంటి సినిమాలు ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి సరదాగా గడిపేలా చేస్తాయి. స్నేహబంధాన్ని దృఢంగా చేస్తాయి. కొత్త ఫ్రెండ్స్‌ను పరిచయం చేస్తాయి. మ్యాడ్ లాంటి సినిమాలు రావడం సంతోషంగా ఉంది. మ్యాడ్ సినిమాతో ఈ ముగ్గురు హీరోలు స్టార్స్ అయిపోయారు. ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలా వీళ్ల పేర్లను గుర్తు పెట్టుకుంటారు. కామెడీ చేయడం చాలా కష్టం. నార్నె నితిన్, రామ్, సంగీత్‌లో ఆ టాలెంట్ ఉంది కాబట్టే ఇంత నవ్వించగలిగారు. ఒక స్టోరీ డిస్కషన్‌లో దర్శకుడు కళ్యాణ్‌తో కూర్చున్నప్పుడు ఆయన నేరేషన్‌కే పడిపడి నవ్వా. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో ఊహించగలను. నా ఫేవరెట్ డీవోపీ శామ్‌దత్ ఈ సినిమాకు పనిచేశారు. నిర్మాతగా హారిక మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. నాగవంశీతో నా జర్నీ ‘ప్రేమమ్’తో మొదలైంది. తన ధైర్యమే నాగవంశీని ఇంతదూరం తీసుకొచ్చింది. దర్శకులకు, నటులకు ఎంతో ధైర్యాన్నిస్తూ వరుస విజయాలు అందుకుంటున్నారు. నిర్మాత చినబాబు అంటే కూడా నాకెంతో ఇష్టం. ‘మ్యాడ్‌స్క్వేర్’పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. మంచి ఓపెనింగ్స్ వచ్చి, సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది. ‘మ్యాడ్2’ మాత్రమే కాదు, ‘మ్యాడ్100’ కూడా రావాలని కోరుకుంటున్నా” అన్నారు.
నిర్మాత హారిక సూర్యదేవర మాట్లాడుతూ.. ‘ఒక కామెడీ సీన్ తీసి నవ్వించడం కష్టం. అలాంటిది మా దర్శకుడు కళ్యాణ్‌శంకర్ రెండు కామెడీ సినిమాలు తీసి ఫ్రాంచైజ్ రన్ చేస్తున్నారంటే గ్రేట్” అన్నారు.
హీరో నార్నె నితిన్ మాట్లాడుతూ.. “ఏడాదిన్నర క్రితం మేము మ్యాడ్ సినిమాతో వచ్చాం. అప్పుడు మా పేర్లు కూడా ఎవరికీ సరిగా తెలియదు. అయినా మా సినిమాను పెద్ద హిట్ చేశారు. ఇప్పుడు ప్రేక్షకులకు ఇంకా వినోదం పంచడానికి ‘మ్యాడ్‌స్క్వేర్’తో వస్తున్నాం. మా దర్శకుడు కళ్యాణ్‌శంకర్‌కు సినిమా అంటే చాలా పిచ్చి ఉంది. అందుకే దాన్ని ‘మ్యాడ్’ అనే సినిమా టైటిల్‌తో చూపిస్తున్నారు” అన్నారు.
మరో కథానాయకుడు సంగీత్ శోభన్ మాట్లాడుతూ.. “నాగచైతన్య ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటారు. ఆయన ఈ వేడుకకు రావడం సంతోషంగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ మా టీజర్ చూసి ఎంజాయ్ చేయడంతో మాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. మాతోపాటు విడుదలవుతున్న నితిన్ ‘రాబిన్‌హుడ్’ కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నా” అన్నారు.
ఇంకో హీరో రామ్‌నితిన్ మాట్లాడుతూ.. “సినిమా మీద నాకున్న ప్రేమ, అభిమానం, గౌరవం నన్ను ఇక్కడివరకు తీసుకొచ్చాయి. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృత్ఞతలు” అన్నారు.
‘స్వాతిరెడ్డి..’ పాట కోసం ఈ సినిమాలో భాగమైన నటి రెబామోనికాజాన్‌తోపాటు నటుడు విష్ణు ఓఐ ఈ సినిమాతో తమ అనుబంధాన్ని, అనుభవాలను ఈ వేదికపై పంచుకున్నారు. అతిథులుగా పాల్గొన్న దర్శకులు మారుతి, వెంకీ అట్లూరి కూడా ఈ వేడుకలో ప్రసంగిస్తూ.. ఈ సినిమా గురించి తమ అభిప్రాయాలను తెలియజేశారు.