- పాకిస్తాన్‌ను ఖంగుతినిపించిన భారత్
- వరుసగా ఐదో విజయం
- ఆసియా చాంపియన్స్ ట్రోఫీ
హులిన్‌బిర్ (చైనా): హీరో ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో 2 తేడాతో పాకిస్తాన్ మీద విజయఢంకా మోగించింది. ఈ టోర్నీలో ఇండియాకు ఎదురే లేకుండా పోతోంది. ఇప్పటికే 4 వరుస విజయాలతో సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్న డిపెండింగ్ చాంపియన్ నేడు తన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కూడా విజయం సాధించింది. దీంతో విజయాల సంఖ్య 5కు చేరుకుంది.
పాక్‌కు షాక్..
ఇప్పటికే సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్న భారత్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌తో తలపడింది. భారత్‌కు ఈ మ్యాచ్ గెలిచినా ఓడినా కానీ పెద్దగా ప్రభావం ఉండదు. కానీ హర్మన్‌ప్రీత్ సేన మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు. దాయాది పాకిస్తాన్‌ను మ్యాచ్ ఆరంభం నుంచే ఒత్తిడిలోకి నెట్టింది. అదే ఒత్తిడిలో పాక్ ఆటగాళ్లు చేసిన తప్పులను భారత్ గోల్స్‌గా మల్చుకున్న తీరు అద్భుతం.
రెండు కూడా..
భారత్ సాధించిన రెండు గోల్స్ కూడా పెనాల్టీ కార్నర్ల రూపంలో రావడం విశేషం. భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (13,19 నిమిషాల్లో) గోల్ సాధించి తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టాడు. పాకిస్తాన్ చివరి వరకు ఎంత ప్రయత్నించినా కానీ మరో గోల్ సా ధించడంలో విఫలం అయింది. దీంతో భారత్‌ను 2 తేడాతో విజయం వరించింది.
తొలి గోల్ పాక్‌దే..
ఈ మ్యాచ్‌ను భారత్ గెలిచినా కానీ తొలి గోల్ మాత్రం పాకిస్తాన్ జట్టే సాధించింది. పాక్ తరఫున అహ్మద్ నదీమ్ (ఆట 8వ నిమిషంలో) గోల్ సాధించి పాక్‌ను ఆధిక్యంలో నిలిపాడు. కానీ ఆ ఆధిక్యం ఎక్కువ సేపు నిలవలేదు. దీంతో పాక్ ఆనందం నిమిషాల వ్యవధిలోనే ఆవిరి అయిపోయింది. భారత్ జట్లు రెండు కూడా ఇప్పటికే సెమీస్‌కు క్వాలిఫై అయ్యాయి. కానీ భారత్ మ్యాచ్ అంటే ఉండే మజా మాత్రం ఎక్కడా మిస్ కాలేదు. ఆరు జట్లు పాల్గొ న్న ఈ టోర్నీలో గ్రూప్ రౌండ్‌లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు క్వాలిఫై అవుతాయి.
ఆ మాత్రం ఉంటది..
భారత్ మ్యాచ్ అంటేనే ఎమోషన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. ఈ మ్యాచ్‌లో కూడా అది కనిపించింది. మ్యాచ్ ఇంకా పది నిమిషాల్లో ముగుస్తుందనగా.. అంపైర్లు పాక్ ప్లేయర్ రానాకు ఎల్లో కార్డ్ ఇచ్చారు. హాకీలో గ్రీన్ కార్డ్ చూపిస్తే.. 2 నిమిషాల పాటు, ఎల్లో కార్డ్‌కు ఐదు నిమిషాల పాటు కోర్టు బయట ఉండాలి. కానీ కొన్ని సందర్భాలలో ఎల్లో కార్డ్‌కు గురైతే పది నిమిషాల పాటు బయట ఉండేలా ఆదేశాలు ఇస్తారు. ఈ మ్యాచ్‌లో రానాను పది నిమిషాల పాటు సస్పెండ్ చేశారు.అంతే కాకుండా ఆట మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా.. భారత క్రీడాకారుడు మన్‌ప్రీత్‌సింగ్ కూడా ఎల్లో కార్డ్‌కు గురయ్యాడు. అతడిని ఐదు నిమిషాల పాటు సస్పెండ్ చేశారు. అప్పుడు ఇండియా కేవలం 10 మందితోనే ఆడింది.
టెన్షన్‌గా చివరి క్వార్టర్
మొదటి మూడు క్వార్టర్లు ముగిసే సరికి భారత్ 2 లీడ్‌తో ఉంది. స్కోర్లు సమం చేసి మరోసారి మ్యాచ్‌పై పట్టు బిగించేందుకు పాక్‌కు మరో గోల్ కావాలి. అదే సమయంలో ఆధిక్యాన్ని మరింత పెంచుకునేందుకు భారత ప్లేయర్లు కూడా అవిశ్రాంతంగా శ్రమించారు. ఇరు జట్ల ఆటగాళ్లు గోల్ పోస్టులపై దాడులు పెంచి.. ప్రేక్షకులకు ఉత్కంఠను కలుగజేశారు. చివరికి వచ్చే సరికి పాక్ జట్టులో ఒకరు, భారత జట్టులో ఒకరు ఎల్లో కార్డుకు గురై.. పది మందితోనే ఆడారు. అయినా కానీ ఏ జట్టు కూడా మరో గోల్ సాధించలేకపోయింది. దీంతో మ్యాచ్ 2 తేడాతో ముగిసింది.