calender_icon.png 19 April, 2025 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెండితెర పాలరాతి శిల్పం!

13-04-2025 01:29:01 AM

సారిక ఠాగూర్.. మత్తెక్కించే కళ్లు. మైమరిపించే సొగసు. దివినుంచి భూమికి దిగి వచ్చిన దేవకన్యా లేక ప్రాణం పోసుకున్న పాలరాతి శిల్పమా అన్నట్లుగా ఉండే అందం ఆమె సొంతం అందుకే నటనకే ఓనమాలు నేర్పే కమల్ హాసన్ సహితం ఆమె ముందు మోకరిల్లాడు. నువ్వే ప్రాణమంటూ దాసోహమయ్యాడు. అంతకు మించి ఏ నటికైనా ఏం కావాలి? కట్ చేస్తే జీవితం ఓ విషాధ భరితమైన ప్రేమ కథగా చరిత్రలో మిగిలింది. 

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి.. జీవితం మధ్యలో వదిలేస్తే.. ఏ అమ్మాయి మాత్రం తట్టుకోగలుగుతుంది? కానీ ఆ కన్నీటిని అదుపు చేసుకోవడమే కాదు.. ఆత్మగౌవరంతో తానేంటో నిరూపించుకున్నది సారిక. ఏడేళ్లు తిరక్కముందే బాలనటిగా అడుగులు వేసిన ఆమె ఆరు పదుల వయసులోనూ నటనతో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నది. సినిమా సినిమాకి మధ్య గ్యాప్ వస్తే నటనకు స్వస్తి చెప్పినట్లే అని భావించే సమయంలో ఎక్కడా వెనుదిరగకుండా ఆరుపదుల వయసులోనూ నటిస్తున్నది.

60 రూపాయలతో.. 

కమల్ హాసన్, సారికకు ఇద్దరు కూతుర్లు. వీళ్లిద్దరికి పెళ్లికాక ముందే శృతి హాసన్ జన్మించింది. తర్వాత మూడు సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నారు. అప్పుడు మరో బిడ్డ అక్షర జన్మించింది. ఇష్టంగా పెళ్లాడిన వ్యక్తి వేరే ఆమెతో జీవిస్తున్నాడని తెలిసిన సారిక ఇక ఆ జీవితానికి ముగింపు పలకాలని అనుకుంది. అనుకున్నదే తడువుగా చేతిలో ఉన్న 60 రూపాయలతో స్నేహితురాలి ఇంటికి బయలుదేరింది.

కేవలం స్నానం చేసేందుకే స్నేహితురాలి ఇంటిని ఉపయోగించుకుని కారులోనే నిద్రించేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మరో ఇంటర్వ్యూలో కమల్‌ని అదే జర్నలిస్ట్ ప్రశ్నిస్తే ఆత్మగౌరవంతో జీవించే సారిక ఆ స్థితిలో నేను అందించే ఏ సహాయాన్ని స్వీకరించదనీ నాకు తెలుసు. ఒక రకంగా ఆమెను మరింత కించపరచడమే అవుతుంది. అందుకే ఆమె స్థితి తెలిసి కూడా ఊరుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. 

ఫీనిక్స్‌లా లేచింది..

తీవ్ర నిరాశ నిస్పృహలోనూ ఏనాడు వెనకడుగు వేయలేదు. తాను తీసుకున్న ఏ నిర్ణయమైన ఆ కాలానికే అవి కరెక్ట్ అనే నమ్మే ఆమె ఏ మాత్రం కుంగిపోకుండా తిరిగి తన కెరీర్ మీద ఫోకస్ పెట్టింది. కాస్ట్యూమ్ డిజైనర్‌గా, నటిగా తన పునర్ వైభవాన్ని చాటుకుంటూ అనేక అవార్డులను కైవసం చేసుకుంది. 2005లో ఆమె నటించిన ఆంగ్ల భాషా చిత్రం పర్జానియాకు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నది.

పర్జానియాలో ఆమె 2002 గుజరాత్‌లో జరిగిన అల్లర్ల సమయంలో తన బిడ్డను కోల్పోయిన జొరాస్ట్రియన్ మహిళ పాత్ర పోషించింది. ఖలీద్ మొహమ్మద్ ఆమె నటన గురించి హిందూస్తాన్ టైమ్స్‌లో రాస్తూ.. ‘సారికా అద్భుతంగా, సంయమనం, సజీవమైన నటన పర్జానియాను హృదయపూర్వకంగా చూసుకునేలా చేస్తుంది’ అని ప్రశంసించారు. హే రామ్ చిత్రానికిగాను ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాతీయ చలనచిత్ర అవార్డును సొంతం చేసుకున్నది.