calender_icon.png 31 October, 2024 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇకపై ఏడాదికి రెండుసార్లు టెట్

07-07-2024 12:46:37 AM

ప్రభుత్వం కీలక నిర్ణయం

జూన్‌లో ఒకసారి, డిసెంబర్‌లో మరోసారి.. 

ఇప్పటికే ఒకసారి టెట్ నిర్వహణ

సెప్టెంబర్‌లో మరోసారి నోటిఫికేషన్?

హైదరాబాద్, జూలై 6 (విజయ క్రాంతి): తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)ను నిర్వహించ నుంది. ఒకసారి జూన్‌లో మరోసారి డిసెంబర్ నెలలో టెట్ పరీక్షను నిర్వహించనుంది. ఈమేరకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం రెండుసార్లు లేదా ఒకసారి కచ్చితంగా టెట్‌ను నిర్వహించాలనే నిబంధన ఉంది.

అయితే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండుసార్లు టెట్‌ను నిర్వహించకుండా ఒకసారే నిర్వహించేలా 2015 డిసెంబర్‌లో జీవోను తీసుకొచ్చింది. ఆ జీవో ప్రకారం టెట్ పరీక్షను ఒకసారి మాత్రమే నిర్వహిస్తామని అందులో పేర్కొంది. ఆ జీవో ప్రకారమే గతేడాది 2023 సెప్టెంబర్ 15న టెట్‌ను నిర్వహించింది. అంతకుముందు కూడా ఒకేసారి నిర్వహించింది.

ఈ ఏడాది మార్చిలో టెట్‌కు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం మే 20వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు టెట్‌ను ఒకసారి నిర్వహించింది. రెండోసారి నిర్వహించడంలో భాగంగానే తాజాగా విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేస్తూ జూన్‌లో ఒకసారి, డిసెంబర్‌లో మరోసారి టెట్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే మేలో ఒకసారి టెట్ నిర్వహించడంతో ఇక డిసెంబర్‌లో టెట్‌ను నిర్వహించనుంది. ఇందుకు సెప్టెంబర్‌లో టెట్‌కు నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. 2016లో మే 22న, 2017 జూలై 23న, 2022 జూన్ 12న, 2023 సెప్టెంబర్ 15న, ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 3 వరకు ఆన్‌లైన్‌లో టెట్ పరీక్షలు జరిగాయి. అయితే మధ్యలో 2018, 2019, 2020, 2021లో టెట్‌ను నిర్వహించలేదు.

డీఎస్సీ కోసమే టెట్..

జాబ్ క్యాలెండర్‌ను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. జాబ్ క్యాలెండర్ ద్వారా డీఎస్సీ నోటిఫికేషన్‌ను వేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వచ్చే ఏడాదిలో డీఎస్సీ నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది. ఈక్రమంలోనే డీఎస్సీకి ముందు టెట్‌ను నిర్వహించాలని అనుకుంటుంది. డిసెంబర్‌లో టెట్‌ను నిర్వహించి డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించనుంది. 

2024 మేలో జరిగిన టెట్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు

పేపర్-1 పేపర్-2

పరీక్షకు హాజరైనవారు 85,996 1,50,491

అర్హత సాధించినవారు 57,725 51,443

ఉత్తీర్ణత శాతం 67.13 34.18

2023లో జరిగిన టెట్ వివరాలు

పేపర్-1 పేపర్-2

రాసినవారు 2,23,582 1,90,047

అర్హతసాధించింది 82,489 29,073

ఉత్తీర్ణతశాతం 36.89 15.30