05-07-2024 01:49:08 AM
రాంచి, జూలై 4: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత హేమంత్ సొరేన్ ప్రమాణం చేశారు. మనీలాండరింగ్ కేసులో ఐదు నెలల క్రితం సీఎం పదవికి రాజీనామా చేసిన ఆయన గురువారం రాంచీలోని రాజ్‌భవన్‌లో జార్ఖండ్ 13వ ముఖ్యమంత్రిగా ప్రమా ణం చేశారు. ఆయన చేత రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి జేఎంఎం వ్యవస్థాపకుడు, హేమంత్ తండ్రి శిబుసొరేన్, తల్లి రూపి సొరేన్, సతీమణి కల్పనా సొరేన్‌తోపాటు పలువురు కాంగ్రెస్, జేఎంఎం నేతలు హజరయ్యారు. సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది.
నా నోరు మూయించాలని చూశారు
సీఎంగా ప్రమాణం చేయటానికి ముందు హేమంత్ ఎక్స్‌లో వీడియో షేర్ చేశారు. బీజేపీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘కొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడి నా నోరు మూయించాలని చూశా రు. కానీ, నేడు జార్ఖండ్ ప్రజ లు గళం మళ్లీ విప్పారు. నన్ను వేటాడేందుకు కుట్ర జరిగిం ది. ఇదే ప్రదేశం నుంచి నాడు నా మద్దతుదారులకు సందేశం ఇచ్చాను. మళ్లీ ఇదే ప్రదేశంలో సీఎం అయ్యాను. ఒక గిరిజనుడు ఉన్నతమైన పదవిలో ఉంటే అతడిని పదవి నుంచి దింపేయటం కష్టమని ఇప్పుడు చాలామందికి అర్థమైంది. జై జార్ఖండ్... జై హింద్’ అని వీడియోలో పేర్కొన్నారు.
నాటకీయ పరిణామాలు
ఈ ఏడాది ప్రారంభంలో సొరేన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదుచేసింది. సీఎంగా ఉన్న ఆయన భూ కుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపించింది. ఈ కేసులో అరెస్టు తప్పదని భావించిన ఆయన జనవరి 31న సీఎం పదవికి రాజీనామా చేశారు. మరుసటి రోజే ఈడీ ఆయనను అరెస్టు చేసి బిర్సాముండా జైలుకు తరలించింది. ఆయన స్థానంలో హేమంత్ సతీమణి కల్పనను సీఎంను చేయాలని భావించినా సొంతపార్టీతోపాటు అధికార కూటమిలో భాగస్వామి అయిన కాంగ్రెస్ నేతలు కూడా వ్యతిరేకించటంతో జేఎంఎంలో నంబర్ 3 స్థానంలో ఉన్న చంపై సొ రేన్‌కు ఆ అవకాశం దక్కింది.
ఫిబ్రవరి 2న ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. ఐదు నెలల తర్వాత హేమంత్‌కు జార్ఖండ్ హైకోర్టు జూన్ 28న బెయిల్ మంజూరు చేసింది. ఈ కుంభకోణంలో హేమంత్‌కు నేరుగా ప్రమేయం లేదని కోర్టు తేల్చింది. దీంతో ఆయన జైలు నుంచి బయటకు వస్తూనే మళ్లీ సీఎం పీఠం ఎక్కేందుకు పావులు కదిపారు. అందుకోసం చంపై సొరేన్‌ను రాజీనామా చేయాల్సిందిగా కోరారు. బుధవారం చంపై సొరేన్ నివాసంలో జేఎంఎం, కాంగ్రెస్ అగ్రనేతలు సమావేశమై హేమంత్‌ను తమ నాయకుడిగా ఎన్నుకొన్నారు.
డిసెంబర్‌లో ఎన్నికలు
జార్ఖండ్ అసెంబ్లీకి ఈ ఏడాది నవంబర్ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ 30 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఉన్నది. అయితే, ఇటీవల ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీచేయటంతో రెండు స్థానాలు తగ్గాయి. అధికార జేఎంఎం, కాంగ్రెస్ కూటమికి మొదట 47 సీట్లు ఉండగా, ప్రస్తుతం 45కు తగ్గాయి. ఇందులో జేఎంఎంకు 27, కాంగ్రెస్‌కు 17, ఆర్జేడీకి 1 ఎమ్మెల్యే ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని బీజేపీ ఇప్పటి నుంచి గట్టి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది. బీజేపీని సమర్ధంగా ఎదుర్కోవాలంటే హేమంత్ సొరేన్ సీఎంగా ఉండాలన్న వాదనతో చంపైని తప్పించి ఆయనకు అధికారం కట్టబెట్టారు.