calender_icon.png 23 October, 2024 | 8:01 AM

కుల వృత్తులకు చేయూత

15-07-2024 01:44:18 AM

బడుగుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

రంగారెడ్డి జిల్లాలో అంతర్జాతీయ నగరం

20వేల ఎకరాల్లో న్యూయార్క్‌లా నిర్మాణం

ప్రపంచ పర్యాటకానికి రాచకొండ కేంద్రం

ఫిల్మ్ సిటీని అందుబాటులోకి తీసుకొస్తాం

త్వరలోనే హయత్‌నగర్ వరకు మెట్రో రైలు

కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ

రంగారెడ్డి, జూలై 14 (విజయ క్రాంతి)/అబ్దుల్లాపూర్‌మెట్: రాష్ట్రంలో కులవృత్తులకు చేయూత అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే సంక్షేమానికి మారుపేరు అని అన్నారు. బల హీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. కుల, చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారికి ఎల్లప్పడూ తోడ్పాటునందిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి గౌడన్నలు తమ పార్టీకి ప్రచార కార్యకర్తలుగా వ్యవహరించారని కొనియాడారు.

ఆదివారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని లష్కర్‌గూడలో నిర్వహించిన కార్యక్రమంలో గీత కార్మికులకు హైదరాబాద్ ఐఐటీ నిపుణులు ఆధునాతన సాకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన కాటమయ్య సేప్టీ కిట్స్‌ను సీఎం రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గీతాకార్మికులకు గత ప్రభుత్వంలో బకాయి పడ్డ ఎక్స్‌గ్రేషియా నిధులు రూ.7.90 కోట్లు వెంటనే విడుల చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రు లు, అధికారులతో కలిసి ఈత, తాటి మొక్కలు నాటారు. గౌడన్నలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కాటమయ్యసేప్టీ కిట్ల పనితీరును పరిశీలించారు.

సేప్టీ కిట్లను ధరించిన గీత కార్మికులు రంగ య్య, కేశమోని నర్సింహ్మగౌడ్‌తో కాసేపు సీఎం ముచ్చటించారు. ‘సేప్టీ కిట్లు ఎలా ఉన్నాయి? నూరు శాతం పాసైనట్టేనా? వృత్తి ఎలా ఉంది? రోజుకు ఎన్ని చెట్లు ఎక్కుతారు? ఎన్ని లీటర్ల కల్లు గీస్తారు? కల్లులో ఏమైనా నీళ్లు కలుపుతున్నారా? బెల్టు దుకాణాల వల్ల మీ ఉపాధికి ఏమై నా దెబ్బపడుతుందా?’ అని ఆరా తీశారు. రియల్ వ్యాపారం విస్తరణతో తాటి చెట్లు నరికేస్తున్నారని, దీంతో బతుకుదెరువు కష్టమవుతున్నదని గీత కార్మికులు సీఎంకు తెలిపారు. తమకు ప్రత్యేకంగా ఐదు ఎకరాల భూమి కేటాయించి తాటి, ఈత వనాలను పెంచాలని కోరారు.

కల్లు గీసేందుకు చాలా దూరం ప్రయాణించాల్సి వస్తున్నదని, అందువల్ల మోపెడ్ వాహనాలు అందివ్వాలని విన్నవించారు. అందుకు సానుకూలంగా స్పం దించిన సీఎం, తప్పనిసరిగా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. గౌడన్నలు పౌరుషానికి మారుపేరు అని కొనియాడారు. ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కినవారి అనుభవంతో తయారుచేసిన కిట్లు గౌడన్నల భద్రతకు ఉపయోగపడుతాయని తెలిపారు. 

ప్రభుత్వాన్ని పడగొడుతామన్నవారు ఏరి?

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడుతామని బీఆర్‌ఎస్, బీజేపీలు బీరాలు పలికాయని, నేడు ఆ పార్టీల నేతలు ఎక్కడ ఉన్నారని సీఎం రేవంత్ ప్రశ్నించారు. వారు తమ పార్టీల నుంచి రోజుకు ఎంతమంది బయటకు వెళ్తున్నారో లెక్కపెట్టుకొనే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ‘వాళ్లు అహంకారంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడుతాం అంటే.. మేము నిలబడుతామంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజాపాలనను చూసి వారంతా మా ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. మా ప్రభుత్వం ఐదేండ్లు సంపూర్ణంగా అధికారంలో ఉంటుంది’ అని స్పష్టంచేశారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చి రూ.౮ లక్షల కోట్ల అప్పులు చేశారని, ఇప్పుడు ప్రతి నెలా రూ.7 వేల కోట్లు అప్పులకు చెల్లిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంపై ఏటా రూ.84 వేల కోట్ల అప్పుల భారం పడుతున్నదని తెలిపారు. అందుకే సంక్షేమ పథకాలకు కొంత ఆలస్యంగా నిధులు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రజలంతా అర్థం చేసుకోవాలని కోరారు. 

బీఆర్‌ఎస్ హయాంలో డ్రగ్స్, గంజాయి

బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగిపోయాయని సీఎం విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం డ్రగ్స్‌ను తెస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమాన్ని తెచ్చిందని అన్నారు. ‘ఓడిపోయి ఫామ్‌హౌస్‌లో ఉన్నోళ్లను అడుగుతున్నా. ఔటర్ రింగ్ రోడ్, ఫార్మా ఇండస్ట్రీ, అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ తెచ్చింది కాంగ్రెస్ కాదా? మీరేం తెచ్చారు డ్రగ్స్, గంజాయి తప్ప. కాంగ్రెస్ పని అయిపోయింది అన్నవాళ్లు.. ఇప్పుడు వాళ్ల వైపు ఎంతమంది ఉన్నారని లెక్కపెట్టుకొంటున్నారు’ అని ఎద్దేవా చేశారు.   

వనమహోత్సవంలో తాటి, ఈత చెట్లకు ప్రాధాన్యం

ప్రభుత్వం నిర్వహించే వనమహోత్సవం లో తాటి, ఈత చెట్లు పెంచేందుకు ప్రాధాన్యం ఇస్తామని సీఎం తెలిపారు. పల్లెలు, పట్టణాల్లోని ప్రభుత్వ భూముల్లో గీత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూములు, రోడ్ల వెంట తాటి, ఈత చెట్లు పెంచుకొనేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. ఇందుకోసం ప్రణాళిక రూపొందించాలని  మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్‌కు సూచించారు. చెరువు గట్లపై ఈత, తాటి చెట్లను పెంచాలని నీటిపారుదల శాఖను ఆదేశించారు. బలహీనవర్గాల ప్రజల పిల్లలు భవిష్యత్తులో పాలకులుగా, ఉన్నతాధికారులుగా ఎదిగేందుకు పునాదులు వేస్తామని హామీ ఇచ్చారు.

సంక్షేమ పథకాలకు బీజం వేసిందే కాంగ్రెస్

రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు బీజం వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వమని సీఎం అన్నారు. నిరుపేద బిడ్డలకు ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్, వైద్య సేవల కోసం ఆరోగ్యశ్రీ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చిందని చెప్పారు. హైదరాబాద్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఫార్మాసిటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేయడం వల్ల రంగారెడ్డి జిల్లా భూములు బంగారుమయం అయ్యాయని పేర్కొన్నారు. త్వరలోనే హయత్‌నగర్, ఓవైసీ హస్పిటల్, ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మెట్రోను విస్తరిస్తామని తెలిపారు.

నిరుద్యోగుల సమస్యలు వింటాం

గత ప్రభుత్వంలాగా సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చేవారిపట్ల తాము ఆమానుషంగా వ్యహరించబోమని సీఎం తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగులు గ్రూప్ డీఎస్సీ పరీక్షలను కొంత కాలంగా వాయిదా వేయాలని కోరుతూ వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారని, వారి సమస్యలను వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తమ సమస్యలు పరిష్కరించాలని మధ్యాహ్న భోజన కార్మికులు సభలో నినాదాలు చేయటంతో సమస్యలను స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలకు తెలుపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్‌బాబు, భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, ఎగ్గె మల్లేషం, దయానంద్ గుప్తా, మహేశ్‌కుమార్ గౌడ్, ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రకాశ్‌గౌడ్, మాజీ ఎంపీ మధుయాష్కీ తదితరులు పాల్గొన్నారు.  

బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయం

బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తున్నదని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. అందుకోసం రాజీ లేకుండా పనిచేస్తున్నట్టు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనలతో పరిశ్రమలకు సంబంధించి 80 పై చిలుకు ఉప ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్టు తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. గీత కార్మికులకు లాభసాటిగా ఉండేలా కార్యక్రమాలకు చేపట్టాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల్లో, రోడ్ల పక్కన తాటి, ఈత చెట్లను పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. 

ప్రపంచ పర్యాటక క్షేత్రంగా రంగారెడ్డి జిల్లా

రానున్న రోజులో రంగారెడ్డి జిల్లాకు మహర్దశ పట్టనుందని సీఎం అన్నారు. ప్రపంచ స్థాయిలో న్యూయార్క్‌కు పోటీగా మహేశ్వరం నియోజకవర్గంలో ఒక అద్భుత నగరాన్ని నిర్మిస్తామని  తెలిపారు. 20 వేల ఎకరాల్లో ప్రపంచస్థాయి హెల్త్‌హబ్, యూనివర్సిటీలు, ఎలక్ట్రిక్ కార్ల తయారీ, టెక్నాలజీ కంపెనీలు, ఫార్మారంగం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తున్నదని చెప్పారు. సైబరాబాద్ తరహాలో హైదరాబాద్‌లో మరో కొత్త నగర నిర్మాణానికి శ్రీకారం చుడతామని తెలిపారు. రాచకొండ ప్రాంత వాతావరణం ఊటీని తలదన్నెలా ఉందని అన్నారు. రానున్న రోజులో రాచకొండ ప్రాంతంలో మరో ఫిల్మ్‌సిటీని కూడా అందుబాటులో తీసుకొస్తామని ప్రకటించారు. ప్రపంచస్థాయి నటులు కూడా ఇక్కడకు వచ్చి షూటింగ్‌లు చేసేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. రానున్న రోజులో ఉపాధి, ఉద్యోగ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా విరాజిల్లుతుందని, ప్రపంచానికే పర్యాటక కేంద్రం కాబోతుందని సీఎం చెప్పారు.