calender_icon.png 1 October, 2024 | 7:10 PM

బాధితులందరికీ సహాయం

04-09-2024 01:28:23 AM

  1. బరాజ్‌ను బోట్లు ఢీకొనడంపై దర్యాప్తు 
  2. సహాయక చర్యలకోసం 
  3. 36 మంది ఐఏఎస్‌లు
  4. జగన్ ఒక బాధితుడినైనా పరామర్శించాడా? 
  5. ఏపీ సీఎం చంద్రబాబు 
  6. ఇంకా వరదనీటిలోనే సింగ్ నగర్

విజయవాడ, సెప్టెంబర్ 3:  వరద బాధితులందరికీ నూరుశాతం సహాయం అంది స్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అలాగే ప్రకాశం బరాజ్ గేట్లను బోట్లు  ఢీ కొన్న ఘటనపై కూడా దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించారు. నాలుగు రోజులుగా వరదలో చిక్కుకుని విలవిలలాడిన విజయవాడ మంగళవారం వరద నీటి మట్టం తగ్గటంతో కొంత ఉపశమనం పొం దింది. ప్రకాశం బరాజ్ నూరేండ్ల చరిత్రలో సోమవారం తొలిసారిగా 47.40 లక్షల క్యూసెక్కుల నీటిని మొత్తం 70 గేట్లను పూర్తిగా ఎత్తివేసి సముద్రంలోకి వదలటం ఒక రికార్డ్‌గా నమోదయింది.

అయితే మంగళవార పైనుంచి వరద నీరు తగ్గటంతో బరాజ్ నుంచి 70 గేట్ల ద్వారా దిగువకు 8.42 లక్షల క్యూసెక్కులు మాత్రమే వదులుతున్నారు. దీనితో కృష్ణానది లంక, తీరగ్రా మాలకు కొంత ముంపు భయం తప్పినప్పటికీ, కృష్ణా నదికి రెండో ప్రమాదం సూచిక కొనసాగుతోంది. వరద నీరు తగ్గిన ప్రాంతా ల్లో అంటువ్యాధులు ప్రబలకుండా యుద్ధ ప్రతిపాదికపై శానిటేషన్ పనులను నగరపాలక సంస్థ చేపట్టింది. సింగ్‌నగర్, నున్న, పాయకాపురం తదితర ప్రాంతాల్లో ఇంకా మూడు నుంచి నాలుగు అడుగుల మేర వరద నీరు నిలిచి ఉంది.

ఎన్‌డీఆర్‌ఎఫ్ దళాలు, కేంద్రం పంపిన ఐదు హెలికాఫ్టర్లు రక్షణ చర్యలు కొనసాగిస్తున్నాయి. సీఎం చంద్రబాబు నాలుగు రోజులుగా విజయవాడ కలెక్టరేట్‌లోనే ఉండి వరదకు గురైన ప్రాంతాల్లో పర్యటించటంతో పాటు సహాయక చర్యలు స్వయంగా పర్యవేక్షస్తున్నారు. మంగళవారం క్రెడాయ్ సంస్థ వరద బాధితులకు ఆహారం, తాగునీరు అందించింది. మరో రెండురోజుల్లో నగరం యథాస్థితికి చేరుతుందని భావిస్తున్నారు. బుడమేరులో వరద  క్రమంగా తగ్గుముఖం పడుతోంది.

బరాజ్‌లోకి పడవలు రావటంపై దర్యాప్తు..

రెండు పడవలు కొట్టుకు వచ్చి ప్రకాశం బరాజ్‌కు చెందిన 64,69 పిల్లర్లను ఢీ కొనడంతో కొంత నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. బోట్లు కొట్టుకు రావడంపై దర్యాప్తు జరిపిస్తామన్నారు. మంగళ వారం విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో మీడియా సమావేశంలో అయన మాట్లాడారు.  పడవల రాక వెనుకు కుట్ర ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏదో ఒక ప్రణాళికపై కుట్రపూరిత చర్యలు జరుగుతున్నాయన్నారు. హాస్టల్ విద్యార్థుల భోజనంలో విషం, గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాల వివాదం లాంటి చర్యలు జరుగుతున్నందున అయా శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించామన్నారు.

సహాయక చర్యలకు నిధుల గూర్చి ఆలోచన చేయవద్దని సూచించారు. వీలైనంత వరకు బాధితులకు ధైర్యం చెప్పడం, భోజన వసతి కల్పించడం, తమకు తోచిన రీతిలో ఆపన్నులను ఆదుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యలు, ఆహారం చివరి వ్యక్తి వరకు చేరాలని, దీని కోసం 36 డివిజన్లకు 36 మంది ఐఏఎస్ అధికార్లను నియ మించినట్లు తెలిపారు. బాధితులను ఆదుకోవటం లో నిర్లక్ష్యం చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో మంగళవారం ఒక అధికారిని సస్పెండ్ చేశామన్నారు. వైసీపీ అధినేత జగన్ కనీసం ఒక బాధితుడినైనా పరామర్శించారా అని ప్రశ్నించారు. దుష్ట రాజకీ యం మానుకోవాలని హెచ్చరించారు. మీడియా కూడా  ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక, రక్షణ చర్యలకు ప్రోత్సాహమిచ్చేలా ఉండాలని కోరారు.

సీఎం సహాయనిధికి విరాళాలు..

వరదలో దెబ్బతిన్న వారిని ఆదుకునేందుకు ఏపీ డిప్యూటీ కలెక్టర్ల సంఘం సీఎం సహాయానిధికి కోటి రూపాయలు, ఎన్‌ఆర్‌ఐ గుత్తికొండ శ్రీనివాస్ కోటి రూపాయ లు, టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్న ఐదు లక్షల రూపాయలు అందించారు.

పవన్ కల్యాణ్ రాలేదేమి?

ప్రజలు సమస్యల్లో ఉంటే వచ్చి వాలిపోయే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ విజయవాడలో కన్పించకపోవటంపై పలువురు వివిధ ఊహగా నాలు చేస్తున్నారు. వాస్తవానికి సోమవారం అయన పుట్టిన రోజు జరిపేం దుకు అభిమానులు భారీ ఏర్పాట్లు చేసినప్పటికీ విజయవాడ ప్రజలు వరదలో చిక్కుకోవడంతో వేడుకలను రద్దు చేసి ఆ ఖర్చుతో బాధితులను ఆదుకోవాలని అభిమానులు, జన సైనికులను కోరారు.

పవన్ ఆదేశాలతోనే  పాలు, పండ్లు, ఆహార పొట్లాలు అందచేశారు. పవన్  తన ఆఫీసులోనే ఉండి ఎప్పటికప్పుడు పంచాయతీ శాఖాధికార్లతో సమీక్షలు జరిపి, ఒకవేళ కరకట్టలు తెగితే ఇసుక మూటలు, ఆహారం సిద్ధం చేయించినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఆయనే విజయవాడ నగరంలో పర్యటి స్తే భారీగా వచ్చే ప్రజలు, అభిమానుల తో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని, అందుకనే తన ఆఫీసులోనే ఉండి పరిస్థితిని సమేక్షించారని పార్టీ వర్గాలు తెలిపాయి.

బుడమేరు ఉగ్ర రూపం.. 

నూజివీడు సమీపంలోని అగిరిపల్లి వద్ద మొదలై విజయవాడ ప్రక్కనుండి కొల్లేరులో కలిసే బుడమేరుకి సామర్థ్యానికి మించి 10 రేట్లు అధికంగా వరద వచ్చింది. దీంతో  కట్ట బలహీనంగా ఉండడంతో మూడు గండ్లు పడి విజయవాడ ఉత్తర బాగాన్ని ముంచేసింది. మంగళవారం వరద తగ్గటంతో గండ్లను పూడ్చి వేసేందుకు సన్నహాలు మొదలయ్యాయని ఇరిగేషన్ శాఖ అధికారి ఒకరు  ‘విజయక్రాంతి’ ప్రత్యేక ప్రతినిధికి చెప్పారు.