calender_icon.png 27 February, 2025 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేయూతనివ్వండి

27-02-2025 02:25:29 AM

1. హైదరాబాద్ మెట్రో ఫేజ్--2కు అనుమతివ్వాలి

2. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగాన్ని మంజూరు చేయండి

3. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌కు నిధులు కావాలి

4. రీజినల్ రింగ్ రైల్.. డ్రైపోర్ట్‌లు మంజూరు చేయండి

5. సెమీ కండక్టర్ మిషన్‌కు అనుమతించండి

* ఐదు ప్రధాన అంశాలపై ప్రధాని నరేంద్రమోదీకి సీఎం రేవంత్‌రెడ్డి వినతి

* ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై ప్రధానికి వివరణ

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే వివిధ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. అయిదు ప్రధాన అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రధానికి అందించారు.

ప్రధాని మోదీని బుధవారం ఢిల్లీలో ఆయన అధికారిక నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పలువురు ఉన్నతాధికారులు కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలతో పాటు విభజన చట్టంలోని పలు అంశాలను కూడా ప్రధాని దృష్టికి సీఎం రేవంత్‌రెడ్డి తీసుకెళ్లారు.

హైదరాబాద్ మహానగరంలోని అన్ని ప్రాంతాలకు మెట్రో రైలు సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చేపడుతున్న ఫేజ్- అనుమతించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం పదేళ్లుగా మెట్రో విస్తరణపై దృష్టి సారించలేదని సీఎం, ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు.

హైదరాబాద్ నగరంలో ఫేజ్--2 కింద రూ.24,269 కోట్ల అంచనాతో 76.4 కిలోమీ టర్ల పొడవైన 5 కారిడార్లను ప్రతిపాదించామని, ఈ ప్రాజెక్టుకు వెంటనే అనుమతించాలని అభ్యర్థించారు.రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగంలో ఇప్పటికే 90 శాతం భూసేకరణ పూర్తయినందున ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగాన్ని వెంటనే మంజూరు చేయాలని ప్రధానమంత్రి మోదీని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.

ఉత్తర భాగం తో పాటే దక్షిణ భాగం పూర్తయితే ఆర్‌ఆర్‌ఆర్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోగలమన్నారు. దక్షిణ భాగం భూ సేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టు ప్రతిపాదన ఉందని పీఎం మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.

ఈ రీజినల్ రింగ్ రైలు పూర్తయితే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని రైలు మార్గాలతో అనుసంధానం  సులభతరమవుతుందని వివరించారు. రీజినల్ రింగ్ రైలుకు అనుమతి ఇవ్వాలని, సముద్ర తీరరేఖలేని తెలంగాణకు వస్తువుల ఎగుమతులు, దిగుమతులు సులువుగా చేసేందుకు రీజినల్ రింగు రోడ్డు సమీపంలో డ్రైపోర్ట్ అవసరమని, ఆ డ్రైపోర్ట్ నుంచి ఏపీలోని సముద్ర పోర్ట్‌లను కలిపేందుకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డుతో పాటు రోడ్డును ఆనుకొని రైలు మార్గం మంజూరు చేయాలని సీఎం కోరారు. 

మూసీ అభివృద్ధికి సహకరించండి..

తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మికత మూసీ నది తో ముడిపడి ఉందని.. రాజధాని హైదరాబాద్ నగరం మధ్యగా మూసీ ప్రవహిస్తోందని.. అంత ప్రాధాన్యమున్న మూసీ పునరుజ్జీవనానికి సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈసా, మూసా నదుల సంగమంలో ఉన్న బాపూ ఘాట్ అభివృద్ధి, గుజరాత్ సబర్మతి ప్రాజెక్టు మాదిరిగా మూసీ ప్రాజెక్టు ఉంటుందని, గోదావరి నదిని మూసీతో అనుసంధానించి స్వచ్ఛమైన జలాలను అందించేందుకు 27 కొత్త మురుగునీటి శుద్ధి కేంద్రాలు మంజూరు చేయాలనిన్నారు.

మూసీ రిటైనింగ్ వాల్స్, కరకట్టల నిర్మాణం, మూసీ గోదావరి నదుల అనుసంధానంతో కలిపి మొత్తంగా ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్ల ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు 222.7 ఎకరాల రక్షణ భూముల బదిలీకి సహకరించాలని పీఎంకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని చెరువుల పునరుద్ధరణకు, ప్యూచర్‌సిటీకి ఆర్థికసాయం చేయాలని కోరారు. 

అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలి : సీఎం

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 61 ఐపీఎస్ కేడర్ పోస్టులు వచ్చాయని, 2015లో రివ్యూ తర్వాత మరో 15 పోస్టులు అదనంగా వచ్చాయని ప్రధానమంత్రి మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులు పెరగడం, రాష్ట్రంలో పెరిగిన పట్టణాలు, ఇతర అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నందున ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అనుమతించాలచన్నారు.

పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి: ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్రమోదీకి రాష్ట్రంలోని ఆరు పెండింగ్ అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఒక నోట్ ఇవ్వగా.. సీఎంకు ప్రధాని మోదీ పలు సూచనలు చేశారు. 2017 నుంచి 2022 వరకు పెండింగ్ అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు.  ప్రధాని ఆవాస్‌యోజన గ్రామీణ పథకం తెలంగాణలో అమలు కావడం లేదని, 2025 మార్చి 31 నాటికి సర్వే పూర్తి చేసి అర్హులను గుర్తించాలని పేర్కొన్నారు.

శంషాబాద్ ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర నిధుల కింద రూ.150 కోట్లు చెలించాలని, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో మూడు మొబైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్‌కి విద్యుత్, వాటర్ సప్లయ్ కోసం రూ.1,365.95 కోట్లు చెల్లించాలని, తెలంగాణలో రెండు రైల్వే ప్రాజెక్టుల కోసం అటవీ అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని,

మూడు నీటి పారుదల ప్రాజెక్టులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం వాటి అంచనాలను సవరించి కేంద్రానికి పంపాలని సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోదీ సూచించారు. పెండింగ్ ప్రాజెక్టులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటనను కూడా పీఎంకు సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.