మిల్లర్ల సమస్యలకు పరిష్కారం చూపుతాం : మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులను పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ధాన్యం సేకరణపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో మాట్లాడారు. చాలా జిల్లాలో ధాన్యం సేకరణ వేగవంతంగా జరగడంపట్ల సంతృప్తి వ్యక్తంచేశారు.
వెనకబడ్డ జిల్లాలో సాధ్యమైనంత వేగంగా కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మిల్లర్లు సహకరించే ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు చేసి, గోదాములకు తరలించాలన్నారు. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌తో కలిసి 30లక్షల టన్నుల సామర్థ్యంగల గోదాములను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులకు ఎక్కడా అసౌకర్యం కలిగిం చొద్దని సూచించారు.
ఏవైనా ఫిర్యాదులు ఉంటే తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో 150 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించనున్నట్టు అంచనావేశారు. సన్న వడ్లు పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందజేస్తున్నట్లు చెప్పారు.
మిల్లింగ్ పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ధాన్యం సేకరణలో మిల్లర్లు సహకరించాలని కోరారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.