గత వారం రోజులుగాఎడతెరిపి లేని వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా రహదారులన్నీ చెరువులుగా మారిపోయాయి. రోడ్లన్నీ గుంతలు పడి వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్ల మరమ్మతులపై దృష్టిపె డతామని ప్రకటించింది కూడా. ఈ లోగానే వర్షాలు రావడంతో ఆ పనులు మొదలు కాలేదు. ఇన్ని రోజులుగా అవస్థలు పడుతూనే ప్రజలు గతుకుల రోడ్లపైనే ప్రయాణాలు సాగిస్తున్నారు. వృద్ధులు, మహిళలు అయితే అనేక అవస్థలు పడుతున్నారు.
రోడ్లు బాగా లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు కూడా అవుతున్నాయి. ఎన్నో విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. జాతీయ రహదారుల పరిస్థితే దారుణంగా ఉన్నప్పుడు ఇక గ్రామీణ రోడ్ల పరిస్థితి చెప్పాల్సిన పని లేదు.పేరుకు పక్కా రోడ్లే కానీ మట్టి రోడ్లకన్నా అధ్వాన్నంగా ఉంటున్నాయి. రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. టైర్లు కోతలకు గురి కావడం, పంక్చర్లు కావడం సర్వ సాధారణంగా మారింది.. కనుక వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత యుద్ధప్రాతిపదికన రహదారుల గుంతలనైనా పూడ్చితే బాగుంటుంది. తర్వాత శాశ్వత ప్రాతిపదికన రోడ్లను బాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
-రాజేశ్, కొత్తగూడెం