ముగ్గురు సిబ్బంది మృతి
న్యూఢిల్లీ, జనవరి 5: తీరరక్షక దళానికి చెందిన ఓ హెలికాప్టర్ గుజరాత్‌లోని పోరుబందర్ తీరంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు పైలట్స్ ఉన్నట్లు ఐసీజీ అధికారులు ధ్రువీకరించారు. ప్రయాణం మొదలయ్యాక సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ హెలికాఫ్టర్ కూలింది. దీనిపై కోస్టుగార్డు ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది.
ఏఎల్‌హెచ్ హెలికాఫ్టర్లలో కీలకమైన రక్షణ చర్యలకు హిందూస్థాన్ ఏరోనాటికల్ సంస్థ ఇప్పటికే చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. గతేడాది సైతం ఈ శ్రేణి హెలికాఫ్టర్లు ప్రమాదాల బారిన పడ్డాయి. ఈ హెలికాఫ్టర్లలో డిజైన్ సమస్యలు ఉండటంతో చాలా చోట్ల వీటిని వాడటం లేదు. గతేడాది మార్చి 8న నౌకాదళానికి చెందిన ఏఎల్‌హెచ్ ధ్రువ్ ముంబై తీరంలో ప్రమాదానికి గురైంది.
అందులోని ముగ్గురు సిబ్బందిని నేవీ పెట్రోలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ సాయంతో కాపాడారు. ఈ ఘటన తర్వాత త్రివిధ దళాల్లో ఈ హెలికాఫ్టర్‌ను వాడటం లేదు. కొన్నాళ్లకు సైన్యం వీటి సేవలను పునరుద్ధరించగా.. ఆ తర్వాత కొన్నాళ్లకే మరో హెలికాఫ్టర్ కూలడం గమనార్హం. నాడు సాంకేతిక లోపం తలెత్తడంతో జమ్మూకాశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్ జిల్లా అటవీ ప్రాంతంలో అత్యవసరంగా దించేందుకు ప్రయత్నిస్తుండగా ఈ చాపర్ కుప్పకూలింది. తెలంగాణకు చెందిన సాంకేతిక నిపుణుడు పబ్బల్ల అనిల్ ఈ ఘటనలో మృతిచెందిన విషయం తెలిసిందే.