దారి మళ్లించిన ఇద్దరు నేతలు
అధికారుల విచారణలో బయటపడిన అక్రమం
నాగర్‌కర్నూల్, నవంబర్ 21 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రంలో లోడ్ చేసిన వడ్ల లారీని కొందరు దొంగచాటుగా దారి మళ్లించడం నాగర్‌కర్నూల్ జిల్లాలో చర్చనీయాంశమైంది. అక్రమార్కులు ఆ ధాన్యాన్ని బ్లాక్ లిస్టులో ఉన్న రైస్ మిల్లుకు తరలించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. బిజినపల్లి మండలం వట్టెంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో సేకరించిన 800 బస్తాల (320 క్వింటాళ్లు) ధాన్యానికి నిర్వాహకులు సీతారామాంజనేయ రైస్ మిల్లుకు ఎంపిక చేసినట్లు రశీద్దులు సిద్ధం చేశారు.
ట్రక్ షీట్ వేసి ఏపి 04 టీవీ 0985 నంబర్ గల వాహన డ్రైవర్ రాజుకు అప్పగించారు. అక్కడి నుంచి బయటకు వెళ్లిన వడ్ల లారీని బిజినపల్లికి చెందిన ఇద్దరు రాజకీయ నేతలు ఆపి, లారీ యాజమానితో కుమ్మక్కై లోడ్‌ను ఓ రైస్ మిల్లుకు అక్రమంగా తరలించినట్లు తెలిసింది. ఈ విషయం బయట ప్రచారం కాగా, అధికారులు అనుమానంతో విచారించారు. లారీ పక్కదారి పట్టినట్లు గుర్తించారు.