26-02-2025 04:26:39 PM
రెండు గంటల పాటు ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
కొత్త రోడ్డు పైన తప్పని ఇబ్బందులు..
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని కన్నాల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా బుధవారం భారీగా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఇటీవల కన్నాల నుండి బుగ్గ దేవాలయం వరకు రూ కోట్లతో పూర్తిచేసిన బిటి రోడ్డుపై వాహనాలు చిక్కుకున్నాయి. బీటీ రోడ్డు వెడల్పు తక్కువగా ఉండడంతో పాటు రోడ్డుకు రెండు వైపులా మట్టితో రోలింగ్ చేయకపోవడంతో వాహనాలు రోడ్డు దిగలేని పరిస్థితి తలెత్తింది. దీంతో బెల్లంపల్లి నుంచి బుగ్గ, బుగ్గ నుంచి బెల్లంపల్లి వైపు వెళ్లే వాహనాలు కిక్కిరిసి ట్రాఫిక్ సమస్యకు కారణమైంది. దాదాపు రెండు గంటలకు పైగా వాహనాలు కదలని పరిస్థితి ఏర్పడింది. దీంతో భక్తుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
వాహనాలు కదిలే పరిస్థితి లేకపోవడంతో చాలామంది భక్తులు వాహనాలను అటవీ మార్గంలోనే నిలిపివేసి కాలినడకన జాతరకు వెళ్లాల్సిన దుస్థితి తలెత్తింది. బుగ్గ రహదారిపై ట్రాఫిక్ సమస్య తలెత్తిన విషయం సోషల్ మీడియాలో తెలుసుకున్న బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ దేవయ్య, తాళ్ల గురజాల ఎస్సై చుంచు రమేష్ లు హుటాహుటిన వచ్చి కొద్దిపాటి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ముందస్తుగా సమస్య తలెత్తే ప్రాంతాల్లో పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచకపోవడం వల్లే ఈ ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఏది ఏమైనా కొత్త రోడ్డు నిర్మించారన్న ఆనందంతో జాతరకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులకు ట్రాఫిక్ సమస్య తలనొప్పిగా మారింది. ట్రాఫిక్ లో చిక్కుకున్న భక్తులు మాత్రం అణువుగా లేని రోడ్డు నిర్మాణంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.