ఎన్నికల వేళ ప్రయాణం కిటకిట
రద్దీగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు
ఓటు కోసం సొంతూళ్లకు పయనం
విజయవాడకు 2 వేల ప్రత్యేక బస్సులు
విశాఖపట్నానికి రెండ్రోజుల్లో 150 ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 11 (విజయక్రాంతి) : పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణీకులతో ఆర్టీసీ బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. నగంరలోని ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్‌లతో పాటు రైల్వే స్టేషన్లు ప్రయాణీలకుతో రద్దీగా మారాయి. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెం టు ఎన్నికలు సోమవారం జరుగనున్నాయి. ఈ క్రమంలో నగరంలో నివసించే ఏపీ ప్రజలు లక్షలాదిమంది తమ సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో మహాత్మాగాంధీ బస్టాండ్, జూబ్లీ బస్టాండ్‌తో పాటు ఎల్‌బీనగర్, హయత్ నగర్, ఉప్పల్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో బస్టాండులు ప్రయాణీకులతో కిక్కిరిసిపోయాయి. రద్దీని ముందు గానే ఊహించిన ఆర్టీసీ, రైల్వే అధికారులు ప్రత్యేక బస్సులు, రైళ్లను నడుపుతున్నారు.
ఎన్నికలు.. వరుస సెలవులు
తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 13న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో హైదరాబాద్ మహానగరం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వారి వారి సొంత గ్రామాలకు తరలిపోతున్నారు. ముఖ్యంగా ఏపీలో పార్లమెంటుతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా నడుస్తున్న ఏపీ ఎన్నికల వైపే అందరి చూపు ఉండటంతో నగర ంలో నివసించే ఏపీ వాసులు అత్యధికంగా సొంతూళ్లకు ఓటు వేసేందుకు తరలి వెలుతున్నారు. వరుసగా శని, ఆదివారాలతో పాటు పోలింగ్ రోజు సోమవారం కూడా ఎన్నికల కమిషన్ సెలవు ప్రకటించింది. దీంతో వరుసగా మూడ్రోజుల సెలవు లు ఉన్నందున చాలా మంది కుటుంబ సమేతంగా బయలుదేరుతున్నారు. హైదరాబాద్ నగరంలో నివసించే ఏపీకి చెందిన వారు సుమారు 20 లక్షలకు పైగా ఉంటారన్నారు.
2 వేల బస్సులు.. రెండ్రోజుల్లో 150 ప్రత్యేక రైళ్లు
ఓటు కోసం సొంతూళ్లకు వెళ్లే ప్రయాణీకుల కోసం ఆర్టీసీ 1950 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. వీటిలో 450 రిజర్వేషన్ల కేటగిరిలో ఉండే డిలక్స్, సూ పర్ లగ్జరీ, ఏసీ బస్సులు ఉన్నాయి. మరో 1500 బస్సులను సిటీలో నడిచే మెట్రో బస్సులను నాన్ రిజర్వేషన్ కేటగిరీలో కేటాయించారు. వీటితో పాటు జిల్లాల నుంచి కూడా బస్సులను తెప్పిస్తున్నారు. ఎంజీబీఎస్ నుంచి రోజుకు 500 బస్సులు, జేబీఎస్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, ఎల్‌బీ నగర్ నుం చి 300 బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. విజయవాడ మార్గంలో ప్రతిరోజూ 150 బస్సులు మాత్రమే నడు స్తుండగా, ప్రస్తుతం రోజూ 500 బస్సు లు నడుస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ లెక్కంతా ఆర్టీసీ అధికారుల ప్రకారమే. ఇంకా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, అద్దె కార్లలో, సొంత వాహనాలలో వెళ్లేవారు సంఖ్య అధికం. దీంతో ఇవన్నీ కలుపుకుని రోజుకి లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి ఈ రెండ్రోజుల్లో 150 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే అధికారులు చెప్పారు. ఒక్కో ప్రత్యేక రైలుకు 22 బోగీలను అదనంగా అమర్చినట్టు తెలిపారు. దీంతో రైల్వే స్లేషన్లు ఇసుక వేస్తే రాలనంతగా జనం రద్దీ విపరీతంగా పెరిగి ఉండటం విశేషం. దీంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌తో పాటు, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి.