calender_icon.png 13 January, 2025 | 12:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద భారీ బందోబస్తు

16-09-2024 12:10:49 AM

గాంధీ ఇంటిని బీఆర్‌ఎస్ శ్రేణులు ముట్టడిస్తారని ఊహాగానాలు 

అష్టదిగ్బంధనంలో సప్తగిరి కాలనీ వాసులు

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్‌రెడ్డి వ్యవహారం నాలుగు రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అరికెపూడి గాంధీ ఇంటి వద్ద మరోసారి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్‌ఎస్ శ్రేణులు గాంధీ ఇంటిని ముట్టడిస్తారన్న సమాచారంతో ఆదివారం ఉదయం దాదాపు 300 మంది పోలీసులతో వివేకానంద నగర్ డివిజన్ సప్తగిరి కాలనీలోని గాంధీ ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. గాంధీ ఇంటి చుట్టుపక్కల పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని నిశితంగా పరిశీలించి కాలనీవాసులు అయితేనే పంపిస్తున్నారు. వివేకానం దనగర్ మెయిన్ రోడ్డు నుంచి జగద్గిరిగుట్ట వైపు వెళ్లే వారిపై కూడా పోలీసులు నిఘా పెంచారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ ఎస్ శ్రేణులు ఒక్కసారిగా దూసుకురావొచ్చనే ఇంటిలిజెన్స్ సమాచారం మేరకు భద్రత పెంచినట్లు సమాచారం. 

ఆంక్షలతో స్థానికుల ఇబ్బందులు..

ఎమ్మెల్యే గాంధీ నివాసం ఉంటున్న సప్తగిరి కాలనీ మొత్తాన్ని పోలీసులు ఆధీనం లోకి తీసుకున్నారు. ఆయన ఇంటికి వెళ్లే పరిసర ప్రాంతాల్లో మొత్తం మూడు చోట్లు బారికేడ్లు ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల నుంచి కాలనీ మొత్తం పోలీసు పహారా కాస్తుండటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజు పోలీసుల మోహరింపు, ఆంక్షలతో బయటకు రాలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.