21-03-2025 12:57:31 AM
హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వానల ప్రభావం ఉత్తర, ఈశాన్య తెలంగాణ లో ఎక్కువగా ఉంటుందని ఐఎండీ అధికారి ధర్మరాజు గురువారం తెలిపారు.
గురువారం రాత్రి బోధన్, నవీ పేటలో ఈదురు గాలులు వీచాయి. శుక్రవారం, శనివారం ఈదురు గాలు లు, వడగళ్ల వానలు ఉన్న నేపథ్యంలో ఈ రెండు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు చెప్పారు. ఆదివారం మోస్తరు వర్షసూచన నేపథ్యం లో ఎల్లో అలర్ట్ జారీచేసినట్లు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందన్నారు.
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచి ర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, ములుగు, మహబూబాబాద్, వరంగల్, ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ద్రోణి ప్రభావం ఉంటుందని తెలిపారు. ఉరుములు, మెరుపులతో గంట కు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఈదు రు గాలులు, వడగళ్లతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మూడు రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు యథావిధిగా పెరుగుతాయని ఐఎండీ పేర్కొంది.
సిటీలో రేపు తేలికపాటి వాన
హైదరాబాద్‌లో శనివారం తేలికపాటి వాన కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. రాబోయే 24 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. ఉదయం వేళలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వివరించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు, కనిష్ఠం ఉష్ణోగ్రతలు 22 డిగ్రీలు నమోదవుతాయని, తద్వారా నగర వాసులకు ఎండ నుంచి కాస్త ఉపశమనం లభించనుంది.
రైతులకు అలర్ట్
ఇది పంటల కోతల సమయం. వరి, మామిడి రైతులకు వడగళ్లు, ఈదురు గాలులు తీవ్రంగా నష్టం కలిగించే అవకాశం ఉంది. అయితే వడగళ్లు, ఈదురు గాలులు ఉత్తర, ఈశాన్య తెలంగాణలోని 8 జిల్లాలోనే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మిగతా జిల్లాలోని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐఎండీ చెబుతోంది. అయితే ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో మాత్రం రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.