చెన్నై, నవంబర్ 12: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో భారీగా వర్షం కురుస్తున్నది. ఈ నెల 15 వరకు వర్షసూచన ఉన్నట్లు భారత వాతావరణశాఖ (ఐఎండీ) ప్రకటించింది. మంగళవారం 12 జిల్లాల వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. చెన్నైలో అత్యధికంగా 26 సెం.మీ వర్షపాతం నమోదైంది. జడివానతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
అలాగే కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు జిల్లాల్లో సగటున 6 సెం.మీ మేర వర్షం కురిసింది. వానల నేపథ్యంలో సీఎం స్టాలిన్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. దీంతో విద్యార్థులు ఇండ్లకే పరిమితమయ్యారు. మరో 48 గంటల పాటు ఇదే స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని, ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల వరకు పడిపోవచ్చని ఐఎండీ వెల్లడించింది.
ఏపీపైనా ప్రభావం..
అల్పపీడన ప్రభావం ఏపీపైనా ఉంటుందని, ఈ నెల 15 వరకు అక్కడ వానలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. దక్షిణ కోస్తా జిల్లాలైన ఉమ్మడి ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన చెదురు మదురు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాస్త తక్కువ ప్రభావం ఉంటుందని వెల్లడించింది. వరి కోతల సమయం కావడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ అథారిటీ హెచ్చరించింది.