calender_icon.png 16 January, 2025 | 10:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చినుకు.. వణుకు.. చిత్తడి చిత్తడి.!

01-09-2024 11:21:22 AM

- ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురువాన. 

- పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు. 

- పలు రూట్లల్లో ఆర్టీసీ సేవలు రద్దు. 

- ఉమామహేశ్వరంలో అర్చక సేవలు నిలిపివేత. 

నాగర్ కర్నూల్, విజయక్రాంతి: నాగర్ కర్నూల్ జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న ముసురు వాన జిల్లాను చిత్తడి చేస్తోంది. మూడు రోజులుగా వాతావరణం చలిగా ఉండడంతో నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన శ్రీకాంత్ (35) అనే ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తీవ్ర చలితో ఫిట్స్ రావడంవల్ల మృతి చెందినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

వాగులు వంకలు పొంగిపొర్లడంతో ప్రధాన రహదారుల వెంట వర్షపు నీరు పరుగులు పెడుతుంది. ఫలితంగా ఆయా ప్రధాన పట్టణాలకు ఆర్టీసీ బస్సు సేవలను నిలిపివేస్తూ ఆర్టిసి నిర్ణయం తీసుకుంది. భారీ వృక్షాలు కూడా ప్రధాన రహదారుల వెంట నేలకూలడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నాగర్ కర్నూల్ జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం వరకు అత్యధికంగా కల్వకుర్తి 16.1, అమరాబాద్ 15.8, వంగూరు 14.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా జిల్లా అంతట యావరేజ్ గా 11.6 సెంటీమీటర్లు వర్షపాతం నమోదయింది.

దీంతో దుందుభి ఉపనది పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలన్నీ వర్షపు నీటిలోనే చిక్కుకున్నాయి. ఆయా గ్రామాలకు ఇతర గ్రామాల నుంచి సంబంధాలు తెగిపోయాయి. దుందుభి నది పరివాహక ప్రాంతాల్లోని ప్రధాన బ్రిడ్జి ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతుండడంతో బస్సు సేవలను నిలిపివేశారు. నాగర్ కర్నూల్ డిపో పరిధిలో హైదరాబాద్, కొల్లాపూర్, రేవల్లి-వనపర్తి, మైసమ్మ రూట్లలో మొత్తంగా 12 బస్సులను నిలిపివేశారు.

అచ్చంపేట డిపో పరిధిలో ఉల్పర-కల్వకుర్తి 2 బస్సులు, బక్క లింగాయపల్లి, కోడేరు, కొల్లాపూర్ ప్రాంతాలకు ఒక్కో బస్సు చొప్పున 5 బస్సులను నిలిపివేశారు. నాగర్ కర్నూల్ తూడుకుర్తి, నాగనూల్, నాగపూర్,  వెన్న చర్ల, మల్కాపూర్, మంతటి, గౌతంపల్లి, గౌరెడ్డిపల్లి వంటి గ్రామాల పరిధిలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లింగాల-మొల్గర రూట్లో భారీ వృక్షం నేలకొరగడంతో ఆ రూట్లో ఆర్టీసీ బస్సు సేవలు నిలిపివేశారు. ఉమామహేశ్వరం ఆలయంలోనూ ఎత్తైన కొండల నుంచి ప్రమాదకరస్థాయిలో జలపాతం జాలవారుతుండడంతో ఆలయ అధికారులు భక్తులను రావద్దని ప్రకటిస్తూ అర్చక సేవలు నిలిపివేశారు.

దీంతోపాటు చెరువులన్నీ మత్తడి దుంకుతూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. 2009లో మత్తడి దుంకిన సింగోటం చెరువు తాజాగా వరద ఉధృతికి భారీ ఎత్తున మత్తడి దుంకుతూ చూపర్లను ఆకట్టుకుంటుంది. వాతావరణ శాఖ నాగర్ కర్నూల్ ప్రాంతాన్ని రెడ్ అలర్టుగా ప్రకటించడంతో జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ హెల్ప్ లైన్ డెస్క్ ఏర్పాటు చేశారు. దీనికి ఎక్కువశాతం చెరువులు,  కుంటలు, నాళాలు కబ్జా చేసిన ఫిర్యాదులే అధికంగా వస్తుండడం విశేషం. శ్రీశైలం వెళ్లే భక్తులు కూడా తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కొండ చర్యలు విరిగి పడుతున్నాయని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పేర్కొన్నారు.