04-04-2025 12:16:49 AM
పలుచోట్ల వడగండ్లు, పంటల నష్టం
జాలిగామలో గోడకూలి వ్యక్తి మృతి
తడిసిన పొద్దు తిరుగుడు
గజ్వేల్, మార్చి 3: గజ్వేల్ డివిజన్ పరిధిలో పలు మండలాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం సమయంలో దాదాపు రెండు గంటల పాటు బలమైన ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వ ర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. బలమైన గాలులు వేయడంతో గంటన్నర పాటు ప్రజల రాకపోకలు స్తంభించాయి. కొన్నిచోట్ల గుడిసెలు, కోళ్ల ఫారాలు కూలి ఆస్తి నష్టం సంభవించింది. జాలిగామలో ఒక ప్రైవేటు గోదాం లో పనులు చేస్తున్న గజ్వేల్ కు చెందిన ఎలక్ట్రీషియన్ హిమ్మత్ ఖాన్(52) గోడ కూలి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
గజ్వేల్ మండలం తో పాటు మర్కుక్ మండలంలోని పలుచోట్ల వడగండ్లు పడి పంటలకు నష్టం వాటిల్లింది. గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో మార్క్ఫెడ్ నిర్వహిస్తున్న పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రం లోని పొద్దు తిరుగుడు ధాన్యం వర్షానికి తడిసిపోయిం ది. పది రోజులుగా తాము తీసుకువచ్చిన పంట కొనుగోలు కేంద్రంలోనే ఉందని, తూకం వేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే జగదేవపూర్, దౌల్తాబాద్, రాయపోల్, కుకునూరుపల్లి కొండపాక, వర్గల్,ములుగు మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.