బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లిలో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గంటకుపైగా ఏకధాటిగా పెద్ద వర్షం కురవడంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. కుండపోతగా కురిసిన భారీ వర్షానికి పట్టణమంతా తడిసి ముద్దయింది. వ్యాపార సంస్థల కార్యకలాపాలు నిలిచిపోయాయి. వర్షం దాటికి ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. రాంనగర్ అండర్ బ్రిడ్జి వరద నీటితో పోటెత్తింది. పాత జిఎం కార్యాలయ రోడ్డు, ఎక్స్ప్లోరేషన్ ఎదుట భారీగా వరద నీరు చేరి రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పాత బస్టాండ్ నుండి కాంటచౌరస్తా వరకు రోడ్డుపై వరద నీరు పోటెత్తడంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాల వ్యాపారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గంటకు పైగా కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతనం చేసింది.