04-04-2025 01:47:46 AM
రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వర్షం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో గురువారం సాయంత్రం హైదరాబాద్ నగరంతోపాటు పలు జిల్లాల్లో వర్షం దంచి కొట్టిం ది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామా రెడ్డి, మహబూబ్‌నగర్‌తోపాటు హైదరాబాద్ నగరంలోనూ 40 నుంచి 50 కి. మీ.ల వేగంతో ఈదురుగాలులతో వర్షం కురిసింది.
రాష్ట్రంలోనే అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయన్‌పూర్‌లో ౯.౮ సెం.మీ.ల వర్షా పాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో మామిడి తోటలు, వరి పంటలు దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కొన్ని రోజులుగా ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు గురువారం కురిసిన అకాల వర్షంతో ఉపశమనం లభించింది.
హైదరాబాద్ నగరంలో..
హైదరాబాద్ నగరంలో అత్యధికంగా హిమాయత్‌నగర్, చార్మినార్‌లలో 9 సెం.మీ.ల వర్షం కురిసింది. సరూర్‌నగర్, నాంపల్లి, ముషీరాబాద్, అంబర్‌పేట, చార్మినార్, షేక్‌పేట, బండ్లగూడలో 8 నుంచి 8.9 సెం.మీ.ల వరకు వర్షం కురిసినట్టు తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీజీడీపీఎస్) తెలిపింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది.
సోమాజిగూడ, ఖైరతాబాద్ ఫ్లుఓవర్, కేసీపీ చౌరస్తా, సైదా బాద్ స్టేట్‌బ్యాంక్ కాలనీ, అసెంబ్లీరోడ్డు, మషీరాబాద్, నెక్లెస్‌రోడ్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో చెట్లు విరిగి పడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జీహెచ్‌ఎంసీ, హైడ్రా, పోలీస్, జలమండలి అధికా రులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
సహాయక చర్యల్లో హైడ్రా, పోలీస్, జీహెచ్‌ఎంసీ సిబ్బంది
వాతావరణ శాఖ హెచ్చరికలతో హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. అకాల వ ర్షంతో నగరంలోని పలు చోట్ల విరిగి పడ్డ చెట్లను హైడ్రా డీఆర్‌ఎఫ్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన తొలగించారు. పలుచోట్ల వరద నీరు నిలిచిపోగా తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. వృక్షాలు పడిపోయిన, నీరు నిలిచిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నేరుగా పరిశీలించారు.
ఖైరతాబాద్ సోమాజిగూడ ఆర్టీఏ కార్యాలయానికి చేరువలో రోడ్డుకు అడ్డంగా పడిన వృక్షాన్ని డీఆర్‌ఎఫ్ బృందాలు తొలగించాయి. నగరంలో భారీ వర్షం కురవడంతో ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఈఆర్‌టీ బృందాలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
నగరవాసులు ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్ హోళ్ల మూతలు తెరవొద్దని సూచించారు. ముంపునకు గురైన మ్యాన్ హోళ్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, డీప్ మ్యాన్ హోళ్ల వద్ద సీవరేజీ సూపర్‌వైజర్లు ఉండాలని ఆదేశించారు. ఇతర వివరాలకు జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 15531కు కాల్ చేయాలని సూచించారు.
పిడుగుపాటుకు ఇద్దరు మహిళా కూలీలు మృతి
నాగర్‌కర్నూల్(విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం కోడోనిపల్లి గ్రామానికి చెందిన సుంకరి సైదమ్మ (40), గాజుల వీరమ్మ (55), సుంకరి లక్ష్మమ్మతో పాటు మరికొందరు అదేగ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో కూలీకి వెళ్లారు. మధ్యాహ్నం వర్షం కురుస్తుందని అందరూ పక్కనే ఉన్న చెట్టు కింద నిల్చున్నారు. ఒక్కసారిగా పిడుగుపడటంతో సైదమ్మ, వీరమ్మ అక్కడికక్కడే మృతిచెందగా లక్ష్మమ్మ తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు.
గోడ కూలి వ్యక్తి మృతి
గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామ పరిధిలో గురువారం భారీ వర్షానికి గోడకూలి వ్యక్తి మృతి చెందాడు. జాలిగామలో ఓ ప్రైవేటు గోదాంలో భారీ వర్షానికి భూమి మెత్తబడి విద్యుత్ పోల్‌లు ప్రహరీగోడపై పడ్డాయి. గోడ కూలి బయటవైపు ఉన్న అక్కడే ఎలక్ట్రికల్, ప్లంబర్ పనులు నిర్వహిస్తున్న గజ్వేల్ పట్టణానికి చెందిన హిమ్మత్‌ఖాన్(52)పై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
ఊడిపడ్డ చార్మినార్ ఆర్చి పెచ్చులు
చార్మినార్: భారీ వర్షం కారణంగా నగరంలోని చారిత్రక కట్టడమైన చార్మినార్‌కు చెందిన ఒక మినార్ నుంచి ఆర్చి పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో పర్యాటకులు ఆందోళన చెంది పరుగులు తీశారు. భాగ్యలక్ష్మి ఆలయం వైపు ఉన్న మినార్ నుంచి పెచ్చులూడి పడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అధికారులు వచ్చి ఊడిపడ్డ పెచ్చులను తొలగించారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు.
రోడ్లపై నీటి నిల్వలు లేకుండా ట్రాఫిక్ సమస్య, విద్యుత్ అంతరాయాలు లేకుండా జీహెఎంసీ, పోలీస్, హైడ్రా విభాగాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో వెంటనే సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని సూఇంచారు.
లోతట్టు ప్రాంతాల్లో జలమయమైన కాలనీల్లో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యను సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేసి వాహనదారులు త్వరగా ఇళ్లకు చేరుకునేలా చూడాలని పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలి. జిల్లాల్లో కూడా కలెక్టర్లు, పోలీసు అధికారులు, అన్ని శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
మరో రెండు రోజులు వర్షాలు!
రాష్ట్రంలో రాబోయే రెండు రోజులు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీచేసింది. 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో వీచే ఈదురుగాలులతోపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజీగిరి, వికారాబాద్, జనగాం, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారా యణపేట, గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ నెల 6న ఎలాంటి వర్షాలు ఉండవని, పూర్తిగా పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించింది. అయితే ఈ నెల 7, 8, 9 తేదీల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణకేంద్రం తెలిపింది.