హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): భారీ వర్షాలతో రాష్ర్టంలోనే అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో విద్యుత్ శాఖకు నష్టం వాటిల్లినట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ పేర్కొన్నారు. బుధవారం ఆయన కోదాడలో వరద ప్రభావంతో దెబ్బతిన్న రామాపురం, ఎంబీ గూడెం సబ్ స్టేషన్లను, ఇతర విద్యుత్ నెట్‌వర్క్‌ను పరిశీలించారు. అనంతరం హైదారాబద్‌లోని హెడ్‌ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. ఈదురు గాలుల ప్రభావంతో 33 కేవీ పోల్స్ పదిహేడు, 11 కేవీ పోల్స్ 1,074, ఎల్‌టీ పోల్స్ 1038, 319 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయని వెల్లడించారు. దీనికి తోడు నాలుగు సబ్ స్టేషన్లు వరద ముంపునకు గురయ్యాయన్నారు. భారీగా నష్టం జరిగినా యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు చెప్పారు. పర్యటనలో సీఎండీతో పాటు చీఫ్ ఇంజినీర్ (రూరల్ జోన్) పి.బిక్షపతి, సూపరింటెండింగ్ ఇంజినీర్ ఫ్రాంక్లిన్ తదితరులు పాల్గొన్నారు.