calender_icon.png 24 October, 2024 | 1:59 PM

జోరుగా జూదం.. కుదేలవుతున్న జీవితం

22-07-2024 02:25:05 AM

  1. మెదక్ జిల్లాలో విచ్చలవిడిగా పేకాట
  2. చోద్యం చూస్తున్న పోలీసు యంత్రాంగం
  3. చేతులు మారుతున్న లక్షల రూపాయలు
  4. చిన్నాభిన్నమవుతున్న పేద కుటుంబాలు

మెదక్, జూలై 21(విజయక్రాంతి) : మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగిర్తిపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు రెండేళ్లుగా ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ జూదానికి బానిసయ్యాడు. తెలిసిన మిత్రులు, బంధువుల వద్ద సుమారు రెండు కోట్ల రూపా యలు అప్పు చేసి జూదం ఆడాడు. అప్పు లు ఇచ్చిన వారు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. అప్పులు తీర్చే మార్గం లేక దిక్కుతోచని స్థితిలో కన్న తండ్రే ఆ యువకున్ని హత్య చేశాడు.

జిల్లాలో ఇలాంటి ఎంతో మంది యువకులు జూదంతో నష్టపోయి జీవితాలను నాశనం చేసుకుంటు న్నారు. కష్టపడకుండా ఈజీగా డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో యువకులు జూదానికి బానిసై కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. మొదట్లో సరదా గా ప్రారంభించి క్రమంగా జూదానికి బానిసవుతున్నారు. దీంతో ఉన్న స్థిర, చరాస్తులు అమ్ముకొని ఆర్థికంగా నష్టపోతున్నారు. మెద క్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో జూదం (పేకాట) జోరుగా సాగుతోంది. పోలీసులు అడ పాదడపా పేకాల స్థావరాలపై దాడులు నిర్వహించి కొంతమంది పేకాటరాయుళ్ళను పట్టుకుంటున్నప్పటికీ వారు ఈ వ్యసనాన్ని వదులుకోలేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. 

చేతులు మారుతున్న డబ్బులు 

ఐదుగురు నుంచి పది మంది వరకు గుంపుగా ఏర్పడి రహస్యప్రాంతాల్లోకి వెళ్ళి పేకాట ఆడుతున్నారు. ముఖ్యంగా జిల్లాలోని రామాయంపేట, మెదక్, పెద్దశంకరంపేట, టేక్మాల్, రేగోడు, అల్లాదుర్గం, పాపన్నపేట, చేగుంట, తూప్రాన్ ప్రాంతాల్లో ఈ జూదం ఎక్కువగా సాగుతోంది. కొన్ని చోట్ల రూ.10 వేలు, మరికొన్ని ప్రాంతాల్లో రూ.20 వేలు డిపాజిట్ చేస్తేనే పేకాట ఆడేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఒక్కో పేకాట స్థావరం వద్ద రోజుకు లక్షల రూపాయల నగదు చేతు లు మారుతున్నట్లు తెలుస్తోంది. కొంతమం ది వ్యక్తులు నిర్వాహకులుగా మారి పంట పొలాలు, మామిడి తోటలు, సమీప అటవీ ప్రాంతాలను స్థావరాలుగా చేసుకొని దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆట ఆడే క్రమంలో వారికి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు పోలీసులను కూడా మేనేజ్ చేస్తు న్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వారి దందా ‘మూడు పువ్వు లు.. ఆరు కాయలు’ అన్న చందంగా కొనసాగుతోంది.

ఆన్‌లైన్‌లోనూ జూదం

ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లో సైతం జోరుగా జూదం కొనసాగుతోంది. అయితే రాష్ట్రంలో ఎనిమిదేళ్ళ క్రితమే జూదానికి సంబంధించిన యాప్‌లను ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ పేకాట రాయుళ్లు ప్లేస్టోర్‌లోని ఫేక్ జీపీఎస్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని తమ లొకేషన్‌ను వేరే రాష్ట్రంలో ఉన్నట్లుగా చూపించి మరీ రమ్మీ గేమ్‌లకు బానిసవుతున్నారు. ఆన్‌లైన్ గేమ్‌లు ఆడే వారిలో ఎక్కువగా యువకులే ఉండడం గమనార్హం. వారికి గేమ్‌పై అవగాహన లేకున్నా యూట్యూబ్‌లలో వీడియోలు చూసి క్రమంగా ఈ ఉచ్చులోకి దిగుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యే ఈ జూదంపై పోలీసులు ఉక్కుపాదం మోపి కట్టడి చేయాలని జిల్లా ప్రజలు, బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 

ప్రత్యేక ఫోకస్ పెట్టాం

మెదక్ జిల్లాలో జూదం నిర్వాహకు లు, పేకాట ఆడేవారిపై ప్రత్యేక నిఘా పెట్టాం. జూదానికి అలవాటు పడి కొం దరు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. జూదం అడేవారి గురించి సమా చారమిస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచు తాం. పేకాట ఆడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. 

 ఉదయ్‌కుమార్ రెడ్డి, మెదక్ ఎస్పీ