హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 4 (విజయక్రాంతి): వరుసగా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ నీటి మట్టం ఎఫ్‌టీఎల్ కు మించిపోవడమే కాకుండా, ఏకంగా మాగ్జిమం వాటర్ లెవల్ (514.75 మీటర్లు)ను అందుకునేలా 513.72 మీటర్ల నీటిమట్టం కలిగి ఉండడంతో అధికారులు, మరో వైపు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోస్త రు నుంచి భారీగా కురుస్తున్న వర్షంతో కాలనీలు, బస్తీలు, రహదారులు చెరువులు, కాలువలను తలపించేలా తయారవుతున్నాయి.
ఆది, సోమవారం కురిసిన భారీ వర్షానికి హుస్సేన్ సాగర్ నీటి మట్టం 513.72 మీటర్లకు నీటిమట్టం చేరడంతో అధికారులు భయాందోళనలు వ్యక్తం చేశా రు. మంగళవారం పగలంతా వర్షం లేని కారణంగా, లోతట్టు ప్రాంతాల్లోని నాలాలోకి నీరు వదలడంతో మంగళవారం హుస్సేన్ సాగర్ నీటిమట్టం క్రమేపీ తగ్గుతూ 513.52 మీటర్లకు నీటి మట్టం తగ్గింది. బుధవారం సాయంత్రం 4.30 గంటలకు 513.63 మీటర్లకు నీటిమట్టం చేరింది.
9 వరకూ హైఅలెర్ట్
వాతావరణ శాఖ అధికారుల సమాచారం మేరకు ఈ నెల 9 వరకు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి హెచ్చరించారు. వాగులు, నాలాలు, చెరువుల వంటి వరద ప్రవాహం అధికంగా ఉండే చోటికి వెళ్లొద్దని సూచిస్తున్నారు. మ్యాన్ హోల్స్ చూసుకుని నడవాలన్నారు. ఎవరైనా మ్యాన్‌హోల్ తెరిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూం 040 2111 1111 లేదా డీఆర్‌ఎఫ్ 90001 13667 నంబరుకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.