calender_icon.png 27 September, 2024 | 4:53 PM

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద

27-09-2024 12:00:00 AM

1,09,214 క్యుస్సెక్కుల ఇన్‌ఫ్లో

22 గేట్లు ఎత్తిన అధికారులు 

నిజామాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): దాదాపు 15 రోజుల తర్వాత శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తింది. మంజీరాతో పాటు మహారాష్ట్ర నుంచి లక్ష క్యూస్సెక్కులకు పైగా వరద వస్తుండటంతో అధికారులు 22 గేట్లు ఎత్తి 81,224 క్యూస్సెక్కుల వరద నీటిని గోదావరి నదిలోకి వదిలి పెడుతున్నారు.

గురువారం ఉదయం ప్రాజెక్ట్‌కు 45,734 క్యూస్సెక్కులు ఉన్న వరద సాయంత్రానికి 1,09,214 క్యుస్సెక్కులకు చేరింది. దీంతో అధికారులు వరదను గోదావరి నదిలోకి మళ్లించారు. ప్రస్తుతం కాకతీయ కాలువకు 6,800 క్యూస్సెక్కులు, ఇందిరమ్మ వరద కాలువకు 19,000 క్యూస్సెక్కులు వదులుతున్నారు. ఈ సీజన్‌లో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఇప్పటి వరకు 197టీఎంసీల వరద రాగా, అందులో 124 టీఎంసీల నీటిని వరద రూపంలో బయటకు వదిలిపెట్టారు. 

కొనసాగుతున్న జూరాల వరద 

గద్వాల (వనపర్తి), సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): ఎగువ ప్రాంతాల నుంచి జూరాల వరద జోరు కొనసాగుతున్నది. గురువారం ఎగువ ప్రాంతం నుంచి 97వేల క్యూసెక్యులు వరద నీరు జూరాలకు రాగా 10 గేట్ల నుంచి 70,750 క్యూసెక్యుల నీరు బయటకు వెళ్లింది. పవర్ హౌస్‌కు 34,449 క్యూసెక్యులు, భీమా లిఫ్ట్‌కు 650 క్యూసెక్యులు, కుడి, ఎడమ కాలువల ద్వారా 1,270 క్యూసెక్యులు శ్రీశైలం వైపు వెళ్తున్నది.