calender_icon.png 8 January, 2025 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాకిస్థాన్‌కు భారీ జరిమానా

07-01-2025 11:48:05 PM

దుబాయ్: సౌతాఫ్రికా చేతిలో వైట్‌వాష్‌కు గురైన పాకిస్థాన్‌కు మరో ఊహించని షాక్ తగిలింది. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్థాన్‌కు ఐదు డబ్ల్యూటీసీ పాయింట్ల కోత విధిస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్‌పై సౌతాఫ్రికా 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. మ్యాచ్ పూర్తయ్యే సమయానికి పాకిస్థాన్ ఐదు ఓవర్లు తక్కువగా వేసినట్లు తెలిసింది. దీంతో మ్యాచ్ రిఫరీ రిచర్డ్‌సన్ పాక్ జట్టుకు జరిమానా విధించినట్లు ఐసీసీ తెలిపింది. ఐసీసీ నిబంధనల ప్రకారం నిర్ణీత గడువు లోగా బౌలింగ్ చేయకపోతే ఓవర్ చొప్పున మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత విధిస్తారు. 5 ఓవర్లు ఆలస్యంగా వేసిన పాక్‌కు మొత్తం ఫీజులో 25 శాతం కోత పడింది. ఐసీసీ జరిమానాను పాక్ కెప్టెన్ షాన్ మసూద్ అంగీకరించినట్లు రిఫరీ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఏడాది డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశాన్ని కోల్పోయిన పాకిస్థాన్ ప్రస్తుతం పట్టికలో 8వ స్థానంలో ఉంది. మరోవైపు లంక, పాకిస్థాన్‌లపై వరుస విజయాలతో సఫారీలు తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనున్నారు. జూన్‌లో లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది.